ఫేస్‌బుక్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

19 Feb, 2021 05:06 IST|Sakshi

కాన్‌బెరా: గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్‌ సంస్థ ఫేస్‌బుక్‌ సంచలనాత్మక తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్‌బుక్‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా ప్రభుత్వ సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్‌బుక్‌ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం  ఖండించింది.

‘ఫేస్‌బుక్‌ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. వార్తలను షేర్‌ చేసినందుకు గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలు ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని, అందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంటూ ఆస్ట్రేలియా ఒక బిల్లును రూపొందించింది. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్‌ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్‌బుక్‌ వ్యాఖ్యానించింది.

>
మరిన్ని వార్తలు