Fact Check: ఫౌచీ ఊస్టింగ్‌.. వైరస్‌ గుట్టు వీడిందా?

24 Jun, 2021 15:28 IST|Sakshi

డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ.. కరోనా టైం నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వైరస్‌ వ్యాప్తి తీరుపై విశ్లేషణ, సలహాలు ఇస్తున్న ఫౌచీని ఉన్నపళంగా ఆ పదవి నుంచి తొలగించారట. అంతేకాదు ఆయన ఊస్టింగ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లో ప్రవేశపెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ ల్యాబ్‌ల్లోనే తయారు చేశారనే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించిందనేది మరో వార్త. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో ఫార్వార్డ్‌ అవుతున్న ఈ వార్తల్లో ఉన్న సగం నిజమెంతంటే.. 

సీనియర్‌ ఫిజిషియన్‌, అమెరికాలోనే టాప్‌ ఇమ్యునాలజిస్ట్‌, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ. అంతెందుకు అమెరికా అధ్యక్షుడికి ఈయనే ఆరోగ్య సలహాదారు కూడా. అలాంటి వ్యక్తిని ఉన్నపళంగా పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందసలు?.. విషయంలోకి వెళ్తే.. ఫౌచీ నిర్లక్క్ష్యం వల్లే అమెరికాలో కరోనాతో తీరని నష్టం వాటిల్లిందని, వైరస్‌ వ్యాప్తి టైంలో ఆయన ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయలేకపోయాడని,  పైగా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి రహస్య ఈ-మెయిల్స్‌ ద్వారా ఫౌచీ కుట్రకు పాల్పడ్డారనేది రిపబ్లికన్‌ ఎంపీ మర్జోరి టేలర్‌ గ్రీనె ఆరోపణ. ఈ మేరకు ఆమె ‘ఫైర్‌ ఫౌచీ యాక్ట్‌’ పేరుతో ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్‌లో చర్చదశకు రాలేదు. ఈలోపే ఓటింగ్‌ జరిగిందని, ఆమోదం దొరికిందని, ఫౌచీ పని అయిపోయిందని ఫేక్‌ కథనాలు వెలువడ్డాయి. 

ఇక కరోనా వైరస్‌ గుట్టు తేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెరికా నిఘా వర్గాలకు 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే(మే 26 ఆదేశాలు వెలువడ్డాయి). వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారా?, లేదంటే జంతువుల ద్వారా సోకిందా? తేల్చాలని ఆయన నిఘా ఏజెన్సీలను ఆదేశించాడు. అయితే నెలలోపే దర్యాప్తు పూర్తైందని, ఇది మనిషి తయారు చేసిందని అమెరికా ధృవీకరించిందని ఒక ప్రైవేట్‌ బ్లాగ్‌ ద్వారా ఫేక్‌ వార్త వైరల్‌ అయ్యింది. ఇక ఈ రెండు ఫేక్‌ అని వైట్‌హౌజ్‌ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ‘ఫౌచీ పట్ల తాను అత్యంత నమ్మకంగా ఉన్నట్లు’ ఈ నెల మొదట్లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బైడెన్‌ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు ఆ అధికారి.

చదవండి: కరోనా పుట్టకపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు