FactCheck: హిల్లరీ క్లింటన్‌ అరెస్ట్‌.. రహస్యంగా ఉరితీత!

18 Jun, 2021 11:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, బిల్‌ క్లింటన్‌ భార్య హిల్లరీ క్లింటన్‌ ప్రాణాలతో లేరా? ఆమెను ఉరి తీశారా?? ఈ మేరకు రెండు రోజుల క్రితం టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో పోస్ట్‌ వైరల్‌ కావడం కలకలం రేపింది. ఇది నిజమో.. కాదో తెలుసుకునేందుకు నిన్నామొన్నా వైట్‌హౌజ్‌ హెల్ప్‌ లైన్‌కి వందల కొద్దీ కాల్స్‌ వచ్చాయి. హత్యా, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను అమెరికా మిలిటరీ అరెస్ట్‌ చేసిందని, గువాంటనమో తీరంలోని జైల్లో రహస్యంగా ఆమెకు ఉరిశిక్షను అమలు చేశారని ఆ పోస్ట్‌ వెనుక సారాంశం. అదే నిజమైతే.. ఆ వార్త సెన్సేషన్‌ కావాలి కదా!. మరి ఎందుకు కాలేదు?.. 

ఫ్యాక్ట్‌చెక్‌.. 73 ఏళ్ల హిల్లరీ నిక్షేపంగా ఉన్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.. ఎవరూ అరెస్ట్‌ చేయలేదు. చివరిసారిగా మార్చి 8న ఆమె లైవ్‌ ఛాట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్‌ 11న ‘ఇన్‌ ది హైట్స్‌’ సినిమా స్క్రీనింగ్‌కు ఆమె హాజరైనప్పుడు.. నటుడు లిన్‌ మాన్యుయెల్‌తో దిగిన ఒక ఫొటో వైరల్‌ అయ్యింది కూడా. ఇక  జూన్‌ 24 ది న్యూయార్క్‌ టైమ్స్‌ నిర్వహించబోయే ఈవెంట్‌లో ఆమె ప్రసంగించబోతున్నారని అక్కడి లోకల్‌ ఛానెల్స్‌ కథనాల్ని టెలికాస్ట్‌ చేశాయి. మరి ఉత్త పుకార్లతో వేలలో వ్యూస్‌ దక్కించుకున్న ఆ వీడియో ఎక్కడి నుంచి పుట్టింది?.  

ఆ ఫేక్‌ గ్రూప్‌ వల్లే..
ఫేక్‌ వార్తలను, నిరాధారణమైన ఆరోపణలు చేసే క్యూఏనన్‌(అతివాద గ్రూప్‌) కుట్రపూర్వితంగా కొన్ని కథనాల్ని పుట్టించి.. సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తోంది.  దీంతో చాలాకాలం క్రితమే ఆ గ్రూప్‌ను బ్యాన్‌ చేసింది అమెరికా. అయినా కూడా ఆ థియరీలు ఏదో ఒక రూపంలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2017లో అప్పటి ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆదేశాల ప్రకారం హిల్లరీని అమెరికా మిలిటరీ అరెస్ట్‌ చేసిందని ఓ ఫేక్‌ కథనాన్ని క్రియేట్‌ చేసింది క్యూఏనన్‌. ఆ కథనాన్ని బేస్‌ చేసుకుని రియల్‌ రా న్యూస్‌ ఇంతకు ముందు ఒక కథనాన్ని పబ్లిష్‌ చేసింది కూడా. ఇప్పుడు ఏకంగా హిల్లరీని ఉరి తీశారంటూ కథనం ప్రచురించడంతో విమర్శలు మొదలయ్యాయి. నిజనిర్ధారణలతో పని లేకుండా ఫేక్‌ కథనాన్ని ప్రచురించిన రియల్‌ రా న్యూస్‌పై చర్యలు తీసుకోవాలని.. అక్కడి ప్రెస్‌ అసోషియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.

చదవండి: వందేళ్ల నాటి శవం నవ్వుతోందా?

మరిన్ని వార్తలు