బైడెన్‌ సలహాదారుడు భారతీయుడా!?

16 Nov, 2020 19:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడెన్‌ పాకిస్థాన్‌ మద్దతుదారుడని, పర్యవసానంగా భారత్‌కు ప్రత్యర్థి అంటూ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతిచ్చిన అమెరికన్‌ భారతీయులు తెగ ప్రచారం చేశారు. వాస్తవానికి ఆయన భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు సానుకూలంగా ఎప్పుడు మాట్లాడలేదు. కశ్మీర్‌ ప్రాంతం ప్రజల విషయంలో తమ వైఖరి ఏమిటని చర్చాగోష్ఠుల సందర్భంగా ప్రశ్నించినప్పుడు తాను కశ్మీర్‌ ప్రజల పక్షమని మాత్రమే చెప్పారు.

అలాగే ఇప్పుడు బైడెన్‌కు వ్యతిరేకంగా మరోవార్త ట్విటర్, ఫేస్‌బుక్‌లో చెలామణి అవుతోంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ తన రాజకీయ సలహాదారుడిగా నియమించారంటూ బైడెన్‌ దంపతులతో అహ్మద్‌ఖాన్‌ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరలవుతోంది. అహ్మద్‌ ఖాన్‌ చికాగోకు చెందిన అమెరికన్‌. ఆయన ఎప్పటి నుంచో బైడెన్‌ దగ్గర పలు హోదాల్లో పనిచేశారు. ఇలినాయి స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డ్రాఫ్ట్‌ బైడెన్‌గా పనిచేశారు.

బైడెన్‌ దేశాధ్యక్షుడిగా విజయం సాధించిన నేపథ్యంలో అహ్మద్‌ ఖాన్‌ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో దిగిన ఫొటోను తన బంధుమిత్రులకు ట్వీట్‌ చేశారు. ఆయన తన మేనమామ వరుసయిన అమ్జెద్‌ ఉల్లాహ్‌ ఖాన్‌కు కూడా ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లోని మజ్లీస్‌ బచావోకు ఉల్లాహ్‌ ఖాన్‌ అధికార ప్రతినిధి.  బైడెన్‌ రాజకీయ సలహాదారుడిగా ఎంపికైనట్టు తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం అహ్మద్‌ ఖాన్‌ దృష్టికి కూడా వెళ్లడంతో అలాంటిదేమీ లేదంటూ ఆయన ఖండించారు.

చదవండి: నేనే గెలిచా.. ఓటమిని అంగీకరించేది లేదన్న ట్రంప్‌

మరిన్ని వార్తలు