‘ఒమిక్రాన్‌’ ఏనాటిదో! ఆర్జీవీలాంటోళ్ల వల్ల ట్రెండింగ్‌.. ఎంత నిజం?

3 Dec, 2021 13:41 IST|Sakshi

Fact Check On Omicron Movie Posters Viral కొత్తగా ఏదైనా పుట్టుకొచ్చిందంటే.. దాని పూర్వాపరాలను తవ్వితీయడం, రంధ్రాన్వేషణ చేయడం అందరికీ అలవాటైన పనే. కరోనా విజృంభణ తర్వాత లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఏమోగానీ.. అప్పటి నుంచి ఇలాంటి వ్యవహారాలు మరింత పెరిగాయి. తాజాగా ఒమిక్రాన్‌ (ఒమైక్రాన్‌) వేరియెంట్‌ పేరు తెర మీదకు వచ్చిన తరుణంలో.. తెర మీద ఆడిన ‘ఒమిక్రాన్‌’ సినిమా గురించి చర్చ మొదలైంది. 


గురువారం సాయంత్రం గూగుల్‌ ట్రెండ్‌లో టాప్‌-25 సెర్చ్‌ కంటెంట్‌లో మూడు ఒమిక్రాన్‌ సంబంధించిన టాపిక్స్‌ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఇది ఒక సినిమాకు సంబంధించిన సెర్చింగ్‌ ద్వారా ట్రెండ్‌లోకి రావడం. 1963లో ‘ఒమిక్రాన్‌’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అది ఇటాలియన్‌ సై-ఫై సినిమా. కథ.. ఏలియన్‌ బాడీస్నాచర్స్‌ చుట్టూ తిరుగుతుంటుంది. అంతేకానీ పాండెమిక్స్‌ గురించి కాదు. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ట్రెండ్‌ అయ్యిందంటారా?  

 

ఐర్లాండ్‌కు చెందిన డైరెక్టర్‌ బెక్కీ చీట్లే ఈ ఇటాలియన్‌ సై-ఫై క్లాసిక్‌ సినిమా టైటిల్‌ను మరోలా వాడేసింది. ‘ది ఒమిక్రాన్‌ వేరియెంట్‌’ పేరుతో సినిమా పోస్టర్లను ఫొటోషాప్‌తో ఎడిట్‌ చేసి.. కింద ‘ది డే ది ఎర్త్ వాజ్‌ టర్న్‌డ్‌ ఇన్‌టు ఏ సిమెట్రీ’(భూమి మొత్తం శ్మశానంగా మారిన రోజు) అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేసింది. అంతే.. అది నిజమని అనుకుని చాలామంది అలాంటి ఓ సినిమా ఉందని, అది ఆ టైంలోనే ప్రస్తుత పరిస్థితులను ఊహించిందంటూ పొరపడి తెగ వైరల్‌ చేశారు.

విశేషం ఏంటంటే.. డైరెక్టర్‌ ఆర్జీవీ లాంటి సినీ సెలబ్రిటీలు కూడా ఆ పోస్టర్లను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారు.  అయితే అవి విపరీతంగా వైరల్‌ కావడం దృష్టికి రావడంతో బెక్కీ చీట్లే మళ్లీ స్పందించింది. తాను సరదాగా వాటిని ఎడిట్‌ చేశానని, 70వ దశకంలో వచ్చిన సినిమాల పోస్టర్లను అలా చేయించానని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టత ఇచ్చింది. 


ఇక 1957 సూపర్‌ హీరో కామిక్‌ స్ట్రిప్ ‘ఫాంటమ్‌’లోని ఓ సీన్‌ డైలాగ్‌ కూడా ఇలాగే వైరల్‌ అవుతోంది. ‘నేనెలా కట్టుకున్నానో అలా కట్టుకో. ఇది నిన్ను ఈ లోయలోని చైనా వైరస్‌ నుంచి కాపాడుతుంది’ అంటూ ఓ రైటప్‌ ఉందక్కడ. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌ కాగా.. అది ఫేక్‌ అని తేలింది. వాస్తవానికి అక్కడ డైలాగ్‌ ‘స్లీప్‌ డెత్‌’ అని ఉంటుంది. సో.. కరోనా వైరస్‌కు ముడిపెట్టి ఎడిట్‌ చేసిన ఫొటో అలా వైరల్‌ అవుతోందన్న మాట!. 

మరిన్ని వార్తలు