Fact Check: హెలికాప్టరుకు ఉరేసి ఉరేగించిన తాలిబన్లు?.. అసలు నిజం ఇది!

1 Sep, 2021 10:20 IST|Sakshi

Taliban Hangs To Helicopter: అమెరికా-నాటో దళాలు అఫ్గన్‌ నేలను విడిచిన తర్వాత తాలిబన్లు రెచ్చిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాందహార్‌లో ఓ వ్యక్తిని చంపి.. అమెరికా గస్తీ హెలికాప్టరుకు వేలాడదీసి గగనతంలో తాలిబన్లు తిప్పిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. అమెరికా రాజకీయ వేత్తలు, నటుల నుంచి మొదలు.. భారత జర్నలిస్టులు, మీడియా హౌజ్‌ల దాకా ఇదొక అఘాయిత్యంగా పేర్కొంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే.. 

అయితే అది తప్పుడు వార్త. మిలియన్ల మంది షేర్‌ చేసిన ఈ వీడియో నిజం కాదని నిర్ధారణ అయ్యింది. పన్నెండు సెకండ్ల వీడియో వీడియో బిల్డింగ్‌ల మధ్య ఓ వ్యక్తి వేలాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అమెరికా పాట్రోలింగ్‌ హెలికాఫ్టర్‌ ఉపయోగించి.. ఓ వ్యక్తిని తాలిబన్లు చంపి ఉరేగించారని, ప్రజలకు భయంకరమైన సందేశాన్ని పంపారంటూ పలువురు భారత జర్నలిస్టులు వరుసపెట్టి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై అమెరికాలో రాజకీయ దురమారం సైతం చెలరేగింది. కానీ, ఇది విషాదం కాదని.. సంబురం అని ఇప్పుడు ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలింది.

అమెరికా దళాలు ఖాళీ చేశాక.. అమెరికా మిలిటరీ యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు. సంబురంగా జెండాలు ఎగరేసి వేడుకలు చేసుకున్నారు. కాందహార్‌లో జెండాను ఎగరేయడానికి బ్లాక్‌ హ్యాక్‌ హెలికాప్టర్‌ ద్వారా ఓ ఫైటర్‌ను ఉపయోగించుకున్న సందర్భం అది. టబుసమ్‌ రేడియో అనే పేజీ నుంచి వైరల్‌ అయ్యింది. అఫ్గన్‌ రేడియో స్టేషన్‌ అగస్టు 30న టెలిగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.

కాందహార్‌లోని గవర్నర్‌ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్‌ మెంబర్‌ ప్రయత్నించాడు. ఫుల్‌ లెంగ్త్‌ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు.  అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా  ఈ ఘటన జరిగింది. కేవలం అక్కడే కాదు.. చాలాచోట్ల జెండాను ఎగరేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సోషల్‌ మీడియాలో.

చదవండి- తాలిబన్లు మంచోళ్లు: క్రికెటర్‌

మరిన్ని వార్తలు