ర‌ష్యా 10 ల‌క్ష‌ల వ్యాక్సిన్ల‌ను పాక్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిందా?

19 Aug, 2020 08:28 IST|Sakshi

మాస్కో: కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ర‌ష్యా 'స్పుత్నిక్' టీకాను ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ దేశాల‌కు కొండంత భరోసా వ‌చ్చిన‌ట్లయింది. అయితే ఈ టీకా మూడో ద‌శ మాన‌వ ప్ర‌యోగాల‌కు సంబంధించిన స‌మాచారంపై స్ప‌ష్ట‌త లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొనడంతో టీకా ఫ‌లితాల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు దీని ఉత్ప‌త్తి ప్రారంభించ‌డానికి ముందే ఈ వ్యాక్సిన్ కావాలంటూ వివిధ దేశాలు కోట్ల సంఖ్య‌లో ఆర్డ‌ర్లు చేశాయి ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌కు రష్యా ప‌ది ల‌క్ష‌ల‌ డోసులు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!)

"చైనా త‌ర్వాత ఇప్పుడు ర‌ష్యా.. పాకిస్తాన్‌కు 10 ల‌క్ష‌ల క‌రోనా వ్యాక్సిన్ల‌ను బ‌హుమ‌తిగా అందిస్తోంది. అయితే ఇది మాన‌వ ప్ర‌యోగాల ‌(మూడో ద‌శ‌‌)కోస‌మేన‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది" అంటూ ఫేస్‌బుక్‌, వాట్సాపుల్లో తిరుగుతున్న వార్త సారాంశం. కానీ ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదు. అస‌లు ర‌ష్యా ఇంకా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభించ‌నేలేదు. వ‌చ్చే నెల‌లో టీకా ఉత్ప‌త్తి ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు పాక్‌కు బ‌హుమ‌తిగా ల‌క్ష‌ల డోసులు ఇస్తున్న‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌నూ‌లేదు, దీనిపై డ‌బ్ల్యూహెచ్‌వో స్పందించ‌నూ లేదు. కాబ‌ట్టి ఇది పూర్తిగా అస‌త్య వార్త‌. అయితే చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో ద‌శ ప్ర‌యోగాలను మాత్రం పాకిస్తాన్‌లోనే ప‌రీక్షిస్తున్నారు. (20 దేశాల నుంచి బిలియన్‌ డోసులు ప్రి ఆర్డర్‌‌)
వాస్త‌వం: ర‌ష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్' వ్యాక్సిన్ 10 ల‌క్ష‌ల డోసుల‌ను పాకిస్తాన్‌కు బ‌హుమ‌తిగా ఇవ్వ‌లేదు.

మరిన్ని వార్తలు