ఫేక్‌ ఫొటోలతో ప్రమోషన్‌.. పరువు తీసిన చైనా యువత

6 Jul, 2021 14:07 IST|Sakshi

‘గ్జియాపు కౌంటీ.. ఫూజియన్‌ ప్రావిన్స్‌లోనే సుందరమైన ప్రదేశం. చిన్న ఊరే అయినప్పటికీ ఆహ్లాదానికి కలిగించే అందాలు ఆ ఊరి సొంతమ’ని చాటింపు వేయించుకుంది చైనా ప్రభుత్వం. ఆ ఫొటోలు చూసి అక్కడికి వెళ్తున్న టూరిస్టులకు.. తీరా అలాంటి అందాలేవీ తారసపడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే అక్కడి యవ్వారమంతా ఉత్తదేనని ఆధారాలతో సహా బయటపెట్టారు కొందరు నెటిజన్స్‌. అదీ చైనావాళ్లే కావడం విశేషం.

బీజింగ్‌: ఒడ్డు నుంచి చూస్తే సుందరంగా కనిపించే దృశ్యాల నడుమ చేపలు పట్టే జాలర్లు, పచ్చదనం మధ్య పశువుల మందలు, పొగమంచులో పక్షుల సందడి, అమాయకపు రైతులు.. వెరసి చైనాలోని రూరల్‌ టౌన్‌ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా టూరిజం శాఖ. అంతేకాదు ఫారిన్‌ టూరిస్టులకు స్పెషల్‌ ప్యాకేజీలతో రాయితీలు కూడా ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వెబో(చైనా వెర్షన్‌ ట్విటర్‌) యాప్‌లలో కూడా ఆ ఫొటోలను పోస్ట్‌ చేసింది. అయితే ఆ యవ్వారం  పైన పటారం.. లోన లొటారం అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఫేక్‌ ఫొటో షూట్‌తో తీసిన ఆ ఫొటోల గుట్టును అక్కడి యువతే సోషల్‌ మీడియాలో లీక్‌ చేసింది. అంతేకాదు అందులో ఉంది నిజం రైతులు, కూలీలు కాదని, వాళ్లు మోడల్స్‌ అని, ఒక్కొక్కరికి 30 డాలర్ల చొప్పున చెల్లించారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం కూడా ప్రచురించింది.

కరోనాతో ఆర్థికంగా దిగజారిని ఆ ఊరిని.. టూరిస్ట్‌ ఆదాయం ద్వారా తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా ప్రమోట్‌ చేసుకుందని ఆ కథనం వెల్లడించింది. అయినప్పటికీ మోసంతో ఆదాయం రాబట్టడం.. దేశం పరువు తీసే అంశమని అక్కడి యువత భావించింది. అందుకే ఆ షూట్ ఫొటోల్ని బయటపెట్టింది.


 

మరిన్ని వార్తలు