ముగ్గురు పిల్లలను కాపాడిన తండ్రి, కానీ

4 Aug, 2020 17:18 IST|Sakshi

లండన్‌: సహజంగా పిల్లలంటే తల్లికే ఎక్కువ ప్రేమంటారు. కానీ ఆ తండ్రికి మాత్రం పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌మౌత్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్న 36 ఏళ్ల జొనాథన్‌ జాఫ్‌ స్టీవెన్స్‌ సోమవారం పిల్లలను తీసుకొని బయటకు వెళ్లాలనుకున్నారు. 12 ఏళ్ల లాసీ, 11 ఏళ్ల లారెన్, 10 ఏళ్ల జాక్‌ను తీసుకొని సమీపంలోని బార్‌మౌత్‌ సముద్ర తీరానికి వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు సముద్ర కెరటాలకు సరదాగా గంతులేస్తుండగా ఓ చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉండి పిల్లలను సముద్రంలోకి లాగేసింది. వెంటనే అప్రమత్తమైన స్టీవెన్స్‌ ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరి చొప్పున ముగ్గురు పిల్లలను కాపాడి ఒడ్డుకు చేర్చగలిగారు.

అప్పటికే నీటికి ఎదురీదలేగ అలసిపోయి ఆయాస పడుతున్న స్టీవెన్స్‌ కడసారి వీడ్కోలు అన్నట్లుగా ముగ్గురు పిల్లలవైపు చూస్తూ ఓ చిరునవ్వుతో నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని ఊహించిన 11 ఏళ్ల లారెన్‌ ‘లైవ్‌ గార్డ్స్‌’ వద్దకు పరుగెత్తికెళ్లి తన తండ్రిని రక్షించాలంటూ వేడుకుంది. వారు పరుగెత్తుకొచ్చి సముద్రంలోకి దూకారు. మరోవైపు నుంచి రిస్క్యూ బోటు కూడా వచ్చింది. కొన ఊపిరితో ఉన్న స్టీవెన్స్‌ను పట్టుకొని రెస్క్యూ బోటులో ఒడ్డుకు తరలించారు. అప్పటికి స్పహతప్పిన స్టీవెన్స్‌కు గుండెపై ఒత్తిడి తీసుకరావడం (సీపీఆర్‌) ద్వారా రక్షించేందుకు ప్రయత్నించారు. దాంతో లాభం లేకపోవడంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ హెలికాప్టర్‌లో స్టీవెన్స్‌ను బ్యాంగర్‌లోని గ్యానెడ్‌ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 

తమ తండ్రి నిజంగా హీరోనని, తమ ముగ్గురు ప్రాణాలను రక్షించారని ఆయన చనిపోవడం తట్టుకోలేక పోతున్నామని 12 ఏళ్ల కూతురు లాసీ మీడియాతో వ్యాఖ్యానించగా, ‘తాను మునిగిపోతూ మమ్మల్ని కాపాడగలిగానన్న తప్తితో చివరిసారిగా చిద్విలాసంగా మావైపు చూస్తూ మా నాన్న నవ్వడాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని లారెన్‌ వ్యాఖ్యానించింది. నెల రోజుల క్రితమే స్టీవెన్స్‌తో విడిపోయిన ఆయన భార్య లారా బర్‌ఫోర్డ్, అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని ష్రాప్‌షైర్‌లో తన చిన్న కుమారుడితో ఉంటున్నారు. పిల్లలు, స్టీవెన్స్‌ ప్రమాదానికి గురైన చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉందని తెల్సిందని, అక్కడ ప్రమాద హెచ్చరికలు ఎందుకు ఏర్పాటు చేయలేదని లారా బీచ్‌ అధికారులను ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు