‘ఈ టెడ్డీ బేర్‌లో ఆ తండ్రి ప్రాణం ఉంది’

29 Dec, 2020 11:25 IST|Sakshi

కంటతడి పెట్టిస్తోన్న వీడియో

వాషింగ్టన్‌: చెట్టంత ఎదిగిన బిడ్డ చేతికి అందివచ్చే సమయంలో మరణిస్తే.. ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణించడానికి మాటలు చాలవు. జీవితాంతం ఆ కడుపుకోత వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. తమను వదిలిపోయిన బిడ్డ అవయవాలను దానం చేసి.. మరి కొందరి కడుపుకోతను దూరం చేస్తారు. వారిలో తమ బిడ్డను చూసుకుంటారు. అమెరికాకు చెందిన జాన్‌ రెయిడ్‌ కూడా ఇదే పని చేశాడు.  2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన బహుళ వాహన ప్రమాదంలో జాన్‌ రెయిడ్‌ కుమారుడు(16) మరణించాడు. దాంతో అతడి అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు జాన్‌ రెయిడ్‌. ఇలా అవయవాలు పొందిన వారిలో రాబర్ట్ ఓ'కానర్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మసాచుసెట్స్‌కు చెందిన రాబర్ట్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. దాంతో జాన్‌ రెయిడ్‌ కుమారుడి గుండెని అతడికి అమర్చారు. (చదవండి: ఐదుగురికి లైఫ్‌ ఇచ్చిన చిన్నారి)

ఆపరేషన్‌ విజయవంతం అయ్యి.. రాబర్ట్‌ కోలుకుని ఇంటికి వెళ్లాడు. తర్వాత తనకు గుండెని దానం చేసి పునర్జన్మ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని భావించాడు. దాంతో తన హార్ట్‌బీట్‌ని రికార్డు చేసి.. ఓ టెడ్డీ బేర్ బొమ్మలో అమర్చి.. దాన్ని రెయిడ్‌కు బహుమతిగా పంపాడు. రాబర్ట్‌ పంపిన గిఫ్ట్‌బాక్స్‌ని ఒపెన్‌ చేసిన రెయిడ్‌ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని హార్ట్‌బీట్‌ని విన్నాడు. ఒక్కసారిగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్‌. గుండె చప్పుడు వింటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ దృశ్యాన్ని రెయిడ్‌ భార్య వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక టెడ్డీ బేర్‌ షర్ట్‌ మీద ‘బెస్ట్‌ డాడ్‌ ఎవర్’‌ అని ఉంది. ఆ కోట్‌ని వాస్తవం చేసి చూపారు అంటూ నెటిజనులు రెయిడ్‌ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు