బైడెన్‌ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడికి చుట్టుకుంటున్న రహస్య ఫైళ్ల వ్యవహారం

23 Jan, 2023 04:37 IST|Sakshi

వాషింగ్టన్‌:  రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్‌లోని బైడెన్‌ ప్రైవేట్‌ నివాసంలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు.

మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్‌ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్‌ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్‌ బోయర్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.  

నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్‌  
గత ఏడాది నవంబర్‌ 2న వాషింగ్టన్‌ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్‌ బైడెన్‌ సెంటర్‌లో, డిసెంబర్‌ 20న వాషింగ్టన్‌ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని  నేషనల్‌ ఆర్కైవ్స్‌ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ప్రెసిడెన్షియల్‌ రికార్డ్స్‌ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్‌ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్‌ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్‌ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్‌ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్‌ బైడెన్‌ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్‌ చేస్తున్నారు. బైడెన్‌ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్‌ విచారణ చేపడుతుందని స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు.

బైడెన్‌కు సన్‌ స్ట్రోక్‌
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్‌ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్‌ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంఫ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్‌ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్‌లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్‌ పోస్టు పత్రిక ప్రచురించింది.   

మరిన్ని వార్తలు