అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు

24 Sep, 2023 13:06 IST|Sakshi

న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. 

నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్‌ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. 

నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు..
నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్‌ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్‌ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది.

నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్‌సర్‌లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది.  

ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన

మరిన్ని వార్తలు