మోడెర్నా టీకాకు అత్యవసర అనుమతి!

19 Dec, 2020 04:25 IST|Sakshi
టీకా వేయించుకుంటున్న మైక్‌ పెన్స్‌

వాషింగ్టన్‌: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఇప్పటికే అనుమతి ఇచ్చింది. 95 శాతం సమర్థంగా పని చేస్తోందని చెబుతున్న ఈ టీకాను కరోనా బాధితులకు అందజేస్తున్నారు. అమెరికాకే చెందిన మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఎంఆర్‌ఎన్‌ఏ–1273కు కూడా అత్యవసర వినియోగ అనుమతి(ఈయూఏ) ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

ఈ మేరకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్టీఫెన్‌ హన్‌ గురువారం చెప్పారు. మోడెర్నా టీకాకు అనుమతి ఇవ్వొచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్‌డీఏకు సిఫార్సు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ సురక్షితమేనని కమిటీ తేల్చింది. అమెరికాలో ఫైజర్‌ టీకా తర్వాత అందుబాటులోకి రానున్న రెండో కరోనా టీకాగా మోడెర్నా వ్యాక్సిన్‌ రికార్డుకెక్కనుంది. గత వారం ఇదే నిపుణుల కమిటీ ఫైజర్‌ టీకాకు అనుమతి ఇవ్వాలంటూ సిఫార్సు చేయగా, ఒక్కరోజులోనే ఎఫ్‌డీఏ నుంచి  లభించింది. మోడెర్నా టీకాకు సైతం త్వరలోనే అనుమతివస్తుందంటున్నారు. 

ఫైజర్‌ టీకా తీసుకున్న నర్సుకు అస్వస్థత
అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ఓ ఆసుపత్రిలో ఫైజర్‌ టీకా తీసుకున్న నర్సు టిఫానీ డోవర్‌ కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఆమె చికిత్స అనంతరం కోలుకున్నారని అధికారులు తెలిపారు.

టీకా వేయించుకున్న మైక్‌ పెన్స్‌
కోవిడ్‌ టీకా తీసుకున్న ప్రపంచనేతగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ నిలిచారు. పెన్స్‌ భార్య కరేన్‌ కూడా టెలివిజన్‌ లైవ్‌లో కోవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఊహించిన దానికంటే ముందుగానే వ్యాక్సిన్‌ రావడానికి అధ్యక్షుడు  ట్రంప్‌ పాలన సాయపడింది. అయితే దేశ చరిత్రలో సుదీర్ఘకాలం నిర్వహించిన 5 రోజుల వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌లో ట్రంప్‌ ఎక్కడా కనిపించలేదు. ట్రంప్‌ టీకా తీసుకోలేదు. అయితే టీకా గురించి మాత్రం రెండుసార్లు ట్వీట్‌ చేశారు.   

>
మరిన్ని వార్తలు