పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌.. అమెరికా కీలక నిర్ణయం

11 May, 2021 10:48 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగం నుంచి పిల్లల్ని రక్షించేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా తాము సాగిస్తోన్న పోరాటంలో మరో కొత్త దశ ప్రారంభమైందని ఎఫ్‌డీఏ కమిషనర్ జెనెట్ వుడ్‌కాక్ పేర్కొన్నారు.

దీంతో పిల్లల పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపే వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత‍్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఫెడరల్‌ వ్యాక్సిన్‌ అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల ప్రకారం..12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను వేయాలని సిఫారసు చేసిన తరువాతనే అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రపంచంలోనే తొలిదేశంగా కెనడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా సైతం పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

ఇటీవల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు 12 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 2 వేల మంది పిల్లలపై ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ వేశారు. గతంలో కంటే వ్యాక్సిన్‌ వేసిన తర్వాత పిల్లలో కోవిడ్‌ పై పోరాటం చేసే ప్రతిరోధకాలు ఉత్పత్తి అయినట్లు గుర్తించామని చిల్డన్‌ స్పెషలిస్ట్‌, ఫైజర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బిల్ గ్రుబెర్‌ తెలిపారు. కాగా, ఫైజర్‌-జర్మన్ బయోఎంటెక్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను వినియోగించాలని ఇటీవల యూరోపియన్ యూనియన్‌తోపాటు ఇతర దేశాలు వినియోగించుకోవాలని కోరాయి.  

చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు!

మరిన్ని వార్తలు