ఉక్రెయిన్‌ని విడిచి వెళ్లాలా? వద్దా?

6 Mar, 2022 09:55 IST|Sakshi

న్యూఢిల్లీ: నగరం విడిచి, దేశ సరిహద్దులకు వెళ్దామంటే దాడుల భయం.. ఎప్పుడు ఏ క్షిపణి దాడికి బలైపోతామో తెలియదు. ఇక్కడే ఉందామంటే తినడానికి తిండిలేదు, తాగడానికి నీరులేదు. పైగా రక్తం గడ్డ కట్టించే చలి పులి భయపెడుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో తలదాచుకుంటున్న భారతీయుల దీనస్థితి ఇది. ఉండాలో వెళ్లిపోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సుమీపై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. క్షిపణుల వర్షం కురిపిస్తోంది.

జనం అండర్‌గ్రౌండ్‌ స్టేషన్లలో, బంకర్లలో ఉం టూ బిక్కుబిక్కుమంటూ భారంగా కాలం గడుపుతున్నారు. బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ఆహారం డొక్కలు ఎండిపోతున్నాయి. ప్రాణాలు దక్కాలంటే తిండి కావాలి. ఎలాగోలా సరిహద్దులకు చేరుకుంటే తప్ప తిండి దొరకదు. కానీ, భీకర యుద్ధం సాగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా రిస్క్‌ చేయొద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది.

సుమీలో దాదాపు 700 మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిని బయటకు తరలించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. విద్యార్థులు సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మంచు కరిగించి, నీటిగా మార్చి తాగుతున్నామని వారు చెప్పారు. ఇంకా ఇక్కడే ఉండలేమని, తమను వెంటనే రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. 

నేడు భారత్‌కు 2,200 మంది రాక!
ఉక్రెయిన్‌ పొరుగు దేశాల నుంచి ఆదివారం 13 విమానాలు భారత్‌కు రానున్నాయని, వీటిలో 2,200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. శనివారం 15 విమానాల్లో 3,000 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 12 ప్రత్యేక పౌర విమానాలు, 3 భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) విమానాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారా, స్పైస్‌జెట్‌ సంస్థలు పౌర విమానాలను పంపిస్తుండగా, ఐఏఎఫ్‌ సి–7 సైనిక రవాణా విమానాలను ఉక్రెయిన్‌ పొరుగు దేశాలైన హంగేరి, రొమేనియా, స్లొవేకియా, పోలండ్‌కు పంపిస్తోంది.

(చదవండి: పుతిన్‌ సైన్యం వీళ్లే!)

మరిన్ని వార్తలు