ట్రంప్‌పై నేరాభియోగాలు

10 Jun, 2023 05:37 IST|Sakshi

నమోదు చేసిన ఫెడరల్‌ జ్యూరీ

మాజీ అధ్యక్షుడిపై నేరుగా అభియోగాలు నమోదు చేయడం

చరిత్రలో తొలిసారి  ఏడు ఆరోపణలతో కేసు నమోదు

మియామి:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒక మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్‌ జ్యూరీ నేరుగా అభియోగాలు నమోదు చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కేసులో 13 తేదీ మంగళవారం మియామి కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

ఒక మాజీ అధ్యక్షుడికి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశం ఎంతగా దిగజారిపోతున్నా, అందరం కలిసి అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ అని నిరూపిద్దామని తన అభిమానులకి పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ముందంజలో ఉన్న ట్రంప్‌ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడం రాజకీయంగా ఆయనకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి.

నిన్నటికి నిన్న పోర్న్‌ స్టార్‌కి ముడుపులు చెల్లించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్‌ ఈ సారి ఏకంగా ఫెడరల్‌ జ్యూరీ అభియోగాలనే నేరుగా ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2021లో గద్దె దిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆర్కీవ్స్‌కు అప్పగించకుండా  ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే

రుజువైతే వందేళ్లు జైలు
రహస్య పత్రాల కేసులో గూఢచర్య చట్టం కింద డొనాల్డ్‌ ట్రంప్‌పై ఏడు అంశాల్లో అభియో గాలు నమోదయ్యాయి. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉంచుకోవడం, న్యాయ ప్రక్రియను అడ్డుకో వడానికి కుట్ర, నిజాయితీ లేకుండా డాక్యుమెంట్లను దాచిపెట్టడం, తన  గుట్టు బయటపడకుండా పథక రచన, తప్పుడు ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఇవి రుజువైతే ట్రంప్‌కి గరిష్టంగా వందేళ్లు  జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ అభియోగాలు ఎలాంటి అడ్డంకి కాకపోయినప్పటికీ రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ అభ్యర్థిత్వానికి ఎంత మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు