పాక్‌ కంచె వేసుకుంటూ పోతుంటే.. తాలిబన్లు ఏం చేస్తున్నారంటే..

25 Dec, 2021 19:21 IST|Sakshi

సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యిందని ప్రకటించుకున్న కొన్నిరోజులకే పాక్‌ సైన్యం-తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 2017 నుంచి పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌ వివాదం తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.  


ఈ తరుణంలో డ్యూరండ్‌ లైన్‌ వెంట పాక్‌ సైన్యం, తాలిబన్‌ ఫోర్స్‌ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దాదాపు అర్థగంట పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  స్థానిక మీడియా హౌజ్‌లతో పాటు ట్విటర్‌లోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.  ఫెన్సింగ్‌ వద్ద తాలిబన్‌ ట్రూప్‌కు చెందిన వ్యక్తి కంచె తొలగిస్తుండగా .. ఇద్దరు పాక్‌ సైనికులు అడ్డుకున్నారని, వారిని ఆ వ్యక్తి కాల్చి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని  సమాచారం.

అయితే ఇరుపక్షాలు మాత్రం నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కొన్ని గంటలకే వ్యవహారం సర్దుమణిగిందంటూ అఫ్గన్‌, పాక్‌ పక్షాల నుంచి ప్రకటన వెలువడింది. ఇక స్థానిక మీడియాలో కథనాలు మాత్రం విరుద్ధంగా ఉంటున్నాయి. మరోవైపు అఫ్గన్‌ సరిహద్దు వెంట 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని దాదాపు పూర్తి చేయగా.. తాలిబన్లు వైర్‌ను తెంచుకెళ్లి ఇనుప సామాన్ల స్టోర్‌లలో అమ్మేసుకుంటున్నారు. ఈ తీరుపైనా పాక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్​కు పాక్​ షాక్​

మరిన్ని వార్తలు