15 నిమిషాల్లోనే కోవిడ్‌ ఫలితం : యూరప్‌లో అనుమతి

1 Oct, 2020 15:07 IST|Sakshi

లండన్‌ : కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా పరీక్షలు చేపట్టేందుకు పలు దేశాలు కసరత్తు ముమ్మరం చేశాయి. పెద్దసంఖ్యలో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా 15 నిమిషాల్లోనే కోవిడ్‌-19 ఫలితాన్ని రాబట్టే పద్ధతికి ఐరోపా మార్కెట్‌లో అనుమతి లభించింది. బెక్టాన్‌ డికిన్సన్‌ అండ్‌ కో అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ పరీక్ష సార్స్‌-కోవ్‌-2 ఉపరితలంపై యాంటీబాడీల ఉనికిని ఇట్టే గుర్తిస్తుంది. చిన్న పరికరంతో నిర్వహించే ఈ యాంటీజెన్‌ పరీక్షకు లేబొరేటరీ అవసరం లేదు. ఈ తరహా కరోనా వైరస్‌ పరీక్షకు అమెరికన్‌ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వాడకానికి జులైలోనే అనుమతించింది. ఇక అక్టోబర్‌ మాసాంతానికి ఐరోపా మార్కెట్‌లనూ టెస్టింగ్‌ కిట్ల విక్రయాన్ని ప్రారంభించేందుకు బెక్టాన్‌ డికన్సన్‌ సన్నాహాలు చేపట్టింది.

ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల్లో, సాధారణ వైద్యులూ ఈ ర్యాపిడ్‌ కరోనా వైరస్‌ టెస్ట్‌ను ఈ పరికరం ద్వారా నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ నియంత్రణలో తాము అభివృద్ధి చేసిన నూతన కోవిడ్‌-19 పరీక్ష గేమ్‌ ఛేంజర్‌ కానుందని బెక్టాన్‌ డికన్సన్‌ డయాగ్నస్టిక్స్‌ అధిపతి పేర్కొన్నారు. యూరప్‌లో రానున్న రోజుల్లో మరో విడత కరోనా వైరస్‌ కేసులు పెరిగే ప్రమాదం పొంచిఉండటంతో ఈ పరీక్షలకు డిమాండ్‌ అధికంగా ఉంటుందని చెప్పారు. కోవిడ్‌-19 వ్యాపించిన తొలినాళ్లలో చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్‌లలో వేగంగా వ్యాధి విస్తరించడంతో యూరప్‌ కూడా కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. కాగా పీసీఆర్‌ పరీక్షలతో పోలిస్తే యాంటీజెన్‌ పరీక్షల కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమ యాంటీజెన్‌ టెస్ట్‌ 99.3 శాతం కచ్చితత్వంతో కూడినదని బెక్టాన్‌ డికిన్సన్‌ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. చదవండి : వ్యాక్సిన్‌ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా?

మరిన్ని వార్తలు