నాటో దిశగా ఫిన్‌లాండ్‌ అడుగులు

13 May, 2022 10:26 IST|Sakshi
ఫిన్‌లాండ్‌ ప్రధాని సన్నా మరిన్‌

అదే యోచనలో స్వీడన్‌

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులు ఉధృతం

కీవ్‌: నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్‌లాండ్‌ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్‌లాండ్‌ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. నాటోలో చేరడం ఫిన్‌లాండ్‌ రక్షణను బలోపేతం చేస్తుందని, అదేవిధంగా నాటో కూటమి దేశాలకు బలాన్నిస్తుందని ఆదేశ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ప్రధాని సన్నా మరిన్‌ చెప్పారు.

నాటోలో వెంటనే చేరాలని, ఇందుకు అవసరమైన చర్యలను రాబోయే రోజుల్లో చేపడతామని తెలిపారు. ఫిన్‌లాండ్‌ ప్రకటనపై రష్యా హెచ్చరిక స్వరంతో స్పందించింది. ఆ దేశం నాటోలో చేరితే రష్యాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఉత్తర యూరప్‌లో స్థిరత్వం నాశనమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకు తాము తగిన మిలటరీ చర్యలతో స్పందిస్తామన్నారు.

రష్యాతో ఫిన్‌లాండ్‌ ఎందుకు ఘర్షణ కోరుతుందో, ఎందుకు స్వతంత్రాన్ని వద్దనుకొని వేరే కూటమిలో చేరుతుందో భవిష్యత్‌ చరిత్ర నిర్ధారిస్తుందన్నారు.  నాటో పొరుగుదేశం స్వీడన్‌ సైతం త్వరలో నాటోలో చేరడంపై నిర్ణయం తీసుకోనుంది. నాటోలో చేరికకు ఈ దేశాలు దరఖాస్తు చేసుకుంటే వాటిని నాటో దేశాల పార్లమెంట్లు ఆమోదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాటోలో చేరాలన్న ఫిన్‌లాడ్‌ నిర్ణయాన్ని నాటో సభ్యదేశాలు స్వాగతించాయి.  

మీ వల్లనే...: నాటోలో చేరాలని తాము భావించేందుకు రష్యానే కారణమని ఫిన్‌లాండ్‌ నాయకులు ఆరోపించారు. తమకు హెచ్చరికలు చేసేముందు రష్యా అద్దంలో చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పరోక్షంగా చెప్పారు. ఉక్రెయిన్‌కు మద్దతుపై ఇటీవలే ఫిన్‌లాండ్‌ నేతలు జెలెన్‌స్కీతో మాట్లాడారు.  ఉక్రెయిన్‌పై దాడి వల్లనే ఇంతకాలం తటస్థంగా ఉన్న స్వీడన్, ఫిన్‌లాండ్‌ నాటోవైపు మొగ్గు చూపాయి.

ఆదేశాల్లో ప్రజానీకం కూడా నాటోలో చేరడంపై సుముఖంగా స్పందించింది. రష్యా దాడి మొత్తం యూరప్‌ భద్రతను సంశయంలో పడేసిందని ఈ దేశాలు ఆరోపించాయి. ఈ దేశాలు నాటోలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని నాటో అధిపతి జనరల్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు. దరఖాస్తు చేసిన రెండువారాల్లో వీటి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని నాటో అధికారులు చెప్పారు.  

దాడులే దాడులు..: ఒకపక్క అనుకున్న విజయం దక్కకపోవడం, మరోపక్క తటస్థ దేశాలైన స్వీడన్, ఫిన్‌లాండ్‌ నాటోలో చేరాలనుకోవడం.. రష్యాకు అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ తూర్పుప్రాంతంపై రష్యా తన దాడులు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో మారియుపోల్‌లో మిగిలిన ఉక్రెయిన్‌ సేనలను తుడిచిపెట్టేందుకు వాయుదాడులు కూడా జరిపింది.

ఇది కూడా చదవండి: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు