-

Imran Khan Rally: ఇమ్రాన్‌ ఖాన్‌ ర్యాలీలో ఫైరింగ్‌.. నలుగురికి గాయాలు

3 Nov, 2022 18:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయమైంది. మరో నలుగురు సైతం గాయపడ్డారు.  ఈ ఘటన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ను కంటైనర్‌ నుంచి బులెట్‌ ప్రూఫ్‌ వాహనంలోకి తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది. 

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో గురువారం ‘నిజమైన ఫ్రీడమ్‌’ ర్యాలీ చేపట్టారు ఇమ్రాన్‌ ఖాన్‌. జఫారలి ఖాన్‌ చౌక్‌ వద్ద దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఫైరింగ్‌ తర్వాత ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోకి మారుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ర్యాలీ సదర్భంగా ఆయన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణం చేశారు. ఈ కాల్పుల్లో పీటీఐ లీడర్‌ ఫైజల్‌ జావెద్‌ సైతం గాయపడినట్లు మీడియా తెలిపింది. ఇమ్రాన్‌ ఖాన్‌ లక్ష్యంగా దుండగుడు పలు రౌండ్ల కాల్పులకు పాల్పడగా.. ఆయన కాలికి గాయమైంది. ఇమ్రాన్‌ను బులెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. 

ఘటనపై భారత్‌ స్పందన.. 
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పుల ఘటనపై భారత్‌ స్పందించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ ఘటన ఇప్పుడే జరిగింది.అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.’అని తెలిపారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చీ. 

ఇదీ చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ ‘సిక్సర్‌’ విక్టరీ.. అధికార పార్టీలో గుబులు!

మరిన్ని వార్తలు