Shark: చేప కోసం వలేస్తే షార్కే పడింది

29 Sep, 2021 07:49 IST|Sakshi

ఓ వ్యక్తి చేపల కోసం వలేస్తే షార్కే పడింది. అయినా షార్క్‌ అంత ఈజీగా పడుతుందా అంటారా.. కచ్చితంగా కాదు. ఆ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టింది. గంట సేపు ప్రాణాలకు తెగించి పోరాడాడు. చివరకు బోట్‌లోకి చేర్చాడు. దాని కొలతలు తీసుకున్నాక తిరిగి సముద్రంలోకి వదిలేశాడు.

ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్‌ డేవిసన్‌ ఎప్పటిలాగే సముద్రంలో వేటకు వెళ్లాడు. వలేశాడు. లాగి చూశాడు. చాలా బరువుగా ఉంది. ఉత్సాహం పెరిగింది. మరింత గట్టిగా ప్రయత్నం చేయగా భారీ షార్క్‌ బయటకు వచ్చింది. దాన్ని చూసిన డేవిసన్‌ గుండె గుభేలంది. మరో ఆరుగురి సహాయంతో దాన్ని బోట్‌లోకి చేర్చే ప్రయత్నం చేశాడు. భారీ పోర్బీగుల్‌ షార్క్‌.. ఒక్కసారిగా సముద్రంలోకి లాగింది. ఆ ధాటికి బోట్‌ 600 మీటర్లు ముందుకుపోయింది. ఇలా గంటసేపు పోరాటం తర్వాత అతి కష్టం మీద ఆ చేపను బోట్‌పైకి తెచ్చారు. దాని కొలతలు తీశారు. 7 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, దాదాపు 249 కిలోలు బరువు ఉన్న ఈ షార్క్‌ను చూసి కాసేపు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత దానికి ఉన్న బంధనాలు తొలగించి, జాగ్రత్తగా మళ్లీ సముద్రంలోకి వదిలేశారు. 
చదవండి: (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) 

ఎందుకంటే.. చాలా మంది జాలర్లు షార్క్‌లను పట్టుకోరు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో పట్టుబడ్డ ఈ తరహా షార్క్‌లలో ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఇంత భారీ చేపలు వలకు చిక్కడం చాలా అరుదని జాలర్లు చెబుతున్నారు. గతంలో క్రిస్‌ బెన్నెట్‌ అనే జాలరికి ఇటువంటి 230 కిలోల  షార్క్‌ దొరికింది. ఆ తర్వాత ఇదే భారీ షార్క్‌. ఇంత పెద్ద షార్క్‌ వలలో పడటం తన జీవితంలోనే మొదటి సారి అని డేవిసన్‌ చెప్పాడు. ఈ భారీ షార్క్‌తో పెద్ద పోరాటమే చేశామని, అటువంటి దానిని పట్టుకోవడం ఆనందం కలిగించిందని అన్నాడు. 
చదవండి: (ఇమ్రాన్‌తో బైడెన్‌ ఎప్పుడు మాట్లాడేదీ చెప్పలేం)

మరిన్ని వార్తలు