మాస్క్‌ పెట్టుకోలేదని చితకబాదారు

5 Aug, 2020 08:57 IST|Sakshi

అమ్‌స్టర్‌డామ్‌ : మాస్కులు పెట్టుకోలేదంటూ భౌతిక దాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా.. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమ్‌స్టర్‌డామ్‌ నుంచి ఐబిజా వెళ్తున్న డచ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కెఎల్‌ఎం విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు మాస్కులు ఇచ్చినా పెట్టుకోకపోవడంతో విమానంలోని తోటి ప్రయాణికులు వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆగస్టు 4న చోటుచేసుకున్న దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానంలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి.(బీరూట్‌ పేలుళ్ల ఘటనపై ట్రంప్‌ స్పందన)

ఇక వీడియో విషయానికి వస్తే.. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు ఐబిజా వెళ్తున్న కెఎల్‌ఎం విమానం ఎక్కారు. అయితే వారిద్దరికి మాస్కులు లేకపోడంతో తోటి ప్రయాణికులు మాస్కులు ధరించాలని కోరారు. వారి వద్ద మాస్కులు లేకపోవడంతో విమానంలో ఏర్పాటు చేసిన మాస్కులను వారికి అందించారు. మాస్కు పెట్టుకోవడానికి వారిద్దరు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఒక వ్యక్తి.. మాస్కు ఇస్తున్నా ధరించరా అంటూ బౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ దశలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పంచ్‌లు విసురుకుంటూ తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే ఇది చూసిన ఇతర ప్రయాణికులు మాస్క్‌ ధరించని వ్యక్తిని కిందపడేసి కాళ్లతో గట్టిగా అణగదొక్కి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారిద్దరిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

అయితే వారిద్దరు మద్యం తాగి విమానమెక్కారని.. మాస్కులు ధరించాలని కోరినా వినకపోవడంతోనే దాడికి పాల్పడాల్సివచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో కెఎల్‌ఎం ఎయిర్‌లైన్స్‌  విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు బోర్డింగ్‌ సమయంలోనే మాస్కులు ధరించాలని.. అలా చేయనివారిని బయటికి పంపించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు