రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..

20 Mar, 2022 19:30 IST|Sakshi

EU Says Cases Of Omicron BA.2: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో మళ్లీ  కోవిడ్‌-19 సబ్‌వేరియంట్ అయిన ఒమిక్రాన్‌ BA.2 కేసులు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంతటా పెరుగుతున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) తెలిపింది. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్-19 కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని వెల్లడించింది.

దీంతో భారత ప్రభుత్వం తమ పౌరులను సురక్షితంగా ఉండమని హెచ్చరించడమే కాక మాస్కలు ధరించడం మానేయవద్దని ఆదేశించింది. చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌లకు సంబంధిందచిన కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదికలో పేర్కొంది. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే కాక హెచ్చరికలు జారీ చేసింది.

ఐదు ఆసియా దేశాల్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు:

చైనా: చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అన్ని దేశాల కంటే చైనా కఠినమైన కరోనా ఆంక్షలను విధించింది. పైగా జిరో కోవిడ్‌ టోలరెన్స్‌ని లక్ష్యంగా ప్రజలపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ చైనా అమలు చేసిన ఆంక్షలన్ని విఫలమయ్యేలా కేసులు రికార్డు స్థాయలో నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో లేని విధంగా కేసులు నమోదవ్వడమే కాక మరణాలు కూడా మొదలయ్యాయి. చైనాలో అనేక నగరాలు నిర్బంధంలోనే ఉన్నాయి.

సింగపూర్: సింగపూర్‌లో శనివారం తాజాగా 10,244 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 1,007,158కి చేరుకుంది. ప్రస్తుతం 1,130 బాధితులు ఆసుపత్రులో చికిత్స పొందుతుండగా, 27 బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉ‍​న్నారు. మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య సుమారు 1,194కు చేరుకుందని ఆ దేవ హెల్త్‌ డిపార్టుమెంట్‌ తెలిపింది.

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో శనివారం ఒక్క రోజులో దాదాపు 16,597 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను అదుపు చేసే దిశలో హాంకాంగ్ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తోంది.

దక్షిణ కొరియా: కొత్త కోవిడ్ -19 కేసులు శనివారం 4 లక్షల కంటే తక్కువగా నమోదైయ్యాయి. ప్రస్తుతం దాదాపు 381,454 కొత్త కోవిడ్-19 కేసులు అందులో విదేశాల నుంచి వచ్చిన 63 మందితో సహా సుమారు 9,038,938కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కెడిసిఎ) పేర్కొంది. తాజా గణంకాల ప్రకారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి సుమారు 621,328 నుంచి గణనీయంగా తగ్గింది, అయితే కేసుల ఆకస్మిక పెరుగుదల మునుపటి రోజు కంటే అనుహ్యంగా 70 వేల కేసులు పెరుగుదలను సూచిస్తోంది. మరణించిన వారి సంఖ్య 12,101కి చేరుకుంది. మరణాల రేటు 0.13 శాతంగా ఉంది.

మయన్మార్: కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్  BA.2 చెందిన 31 కేసులు నమోదైయ్యాయని మయన్మార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 15న పరీక్షించిన 31 మంది కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో BA.2 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ దేశంలో సుమారు 608,384  కేసుల మరణాల దాదాపు 19,420 నమోదయ్యాయని నివేదిక తెలిపింది.

(చదవండి: చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత)

మరిన్ని వార్తలు