అమెరికాలో దారుణం.. జనంపైకి దూసుకెళ్లిన కారు

23 Nov, 2021 07:15 IST|Sakshi
పరేడ్‌పై​కి వేగంగా దూసుకొస్తున్న వాహనం

వాకేషా(అమెరికా): బ్యాండ్‌ వాయిస్తూ స్థానికుల ర్యాలీ, శాంటాక్లాజ్‌ టోపీలతో చిన్నారుల కేరింతలతో సందడిగా ఉన్న క్రిస్మస్‌ పరేడ్‌ ఒక్క క్షణంలో భీతావహంగా మారింది. పరేడ్‌లో పాల్గొన్న స్థానికులను తొక్కేస్తూ వారిపై నుంచి ఎస్‌యూవీ వాహనం ఒకటి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. అమెరికాలోని విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకీ పట్టణం సమీపంలోని వాకేషా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్‌యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒకతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందా? లేదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

త్వరలో జరగబోయే క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరిచుకుని ఇక్కడి స్థానికులు 59వ క్రిస్మస్‌ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్‌యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి ర్యాలీగా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు.

వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్‌ పరేడ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్‌ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది. 

చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..) 

మరిన్ని వార్తలు