రన్నింగ్‌ ఎయిర్‌ ఇండియా విమాన ఇంజన్‌లో మంటలు.. అలర్ట్‌ అయిన పైలట్‌

3 Feb, 2023 10:55 IST|Sakshi

గగనతలంలో ఉన్న ఎయిర్‌ ఇండియా విమానం ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్‌ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్‌ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్‌ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. 

వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్‌ ఇంజన్‌లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్‌ సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు