Floating Cities: అలలపై కలల ఇల్లు.. ఇక భవిష్యత్‌ వీటిదేనా?

18 Oct, 2021 08:21 IST|Sakshi

నెదర్లాండ్స్‌లో నీటిపై తేలియాడే ఇళ్లతో చిన్న నగరాలు ఏర్పాటు

అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నిర్మాణం

ముంపు ముప్పును ఎదుర్కొనేందుకు విభిన్నంగా ముందుకు..

ప్రపంచవ్యాప్తంగా జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. చివరకు ఒక గూడు కట్టుకునేందుకు కూడా కాసింత జాగా దొరకని పరిస్థితి. దీనికి తోడు ప్రకృతి విపత్తులు. భూకంపాలు వచ్చి ఇళ్లు నేలమట్టమవుతుండటం, సముద్రమట్టాలు పెరిగిపోయి నివాసా లను ధ్వంసం చేస్తుండటం.. ఇలా అన్నింటినీ గమనించిన నెదర్లాండ్స్‌లోని పలు నిర్మాణ సంస్థలు సరికొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చాయి. నీటిపై తేలియాడేలా ఇళ్లు నిర్మిస్తే ఎలా ఉంటుంది..? స్థిరంగా ఉండే సరస్సులపై అన్ని వసతులతో నగరాలే ఏర్పాటు చేస్తే..? ఇలా అనుకున్నదే తడవుగా ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వద్ద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి. 
–సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్‌

పొలాలు కూడా నీటిపైనే! 
వాస్తవానికి ఇలా నీటి పైన తేలియాడే ఇళ్లు నిర్మించుకొని నివసించడం, పంటలు పండించడం లాంటివి శతాబ్ధాల కిందటి నుంచే ఉన్నాయి. పెరూ, బొలీవియా సరిహద్దుల్లోని టిటి కాకా సరస్సులో కొంతమంది అనేక ఏళ్ల కిందటి నుంచి తేలియాడే ఇళ్లలోనే జీవిస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా చాలాకాలం కిందట ఇలాంటి నిర్మాణాలుండేవి. కానీ నగరీకరణ, పట్టణీకరణలతో క్రమంగా సరస్సులు, వాటిపైన నిర్మాణాలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు కాలాలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారిపోతుండటంతో నిర్మాణ సంస్థలు మళ్లీ నీటిపైన తేలియాడే ఇళ్లవైపు దృష్టిసారించారు. సముద్రమట్టాలు పెరుగుతుండటం నెదర్లాండ్స్‌కు ముప్పుగా పరిణమించింది. దీంతో అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నీటిపై తేలియాడే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఆ దేశ నిర్మాణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 


ఇక్కడ చదవండి: ఆజానుబాహుల దేశంగా పేరు.. కానీ పొట్టిగా అయిపోతున్నారు!

ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని మాంటెఫ్లోర్‌ సంస్థకు చెందిన వాన్‌ నెమెన్‌ ఏకంగా 100 ఫ్లోటింగ్‌(తేలియాడే) ఇళ్లను నిర్మించి ఒక ఊరునే తయారుచేశాడు. అక్కడ నివసించేవారి కోసం హోటళ్లు, రెస్టారెంట్‌లు, జిమ్‌లు.. ఇలా అన్నీ ఏర్పాటైపోయాయి. అలాగే ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో మింకే వాన్‌ వింగర్డన్‌ నీటిపైనే అత్యాధునిక పశువులశాల, పొలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గానిక్‌ పంటలను ఉత్పత్తి చేయడానికి తాను ఏర్పాటు చేసుకున్న పొలం అనుకూలంగా ఉంటుందని, భవిష్యత్‌లో వీటికి మంచి ఆదరణ ఉంటుందని వింగర్డన్‌ చెబుతున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన ఓషియానిక్స్‌ అనే సంస్థ దాదాపు 200 ఎకరాల్లో 10,000 మంది నివసించేలా నిర్మించబోతోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థిరమైన ఫ్లోటింగ్‌ కమ్యూనిటీ అవుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా త్రిభుజాకారంలో దాదాపు 5 ఎకరాల్లో 300 మంది చొప్పున నివసించేలా తేలియాడే నగరాలను నిర్మిస్తున్నామని తెలిపింది. ముంపు ముప్పు ఎదుర్కొంటున్న వెనిస్, జకర్తా, షాంగై తదితర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చాలా ఉపయోగకరమని పేర్కొంది.  

పెనుగాలులకు నిలుస్తాయా? 
పెనుగాలులకు ఈ ఇళ్లు నిలుస్తాయా? నీటిపైన కొట్టుకుపోకుండా తట్టుకుంటాయా? అనే ప్రశ్నలను చాలా మంది ఆసక్తిదారులు వ్యక్తం చేస్తున్నారని నెదర్లాండ్స్‌లోని నిర్మాణ సంస్థలు తెలిపాయి. తాము అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే విధంగానే వీటిని నిర్మిస్తున్నామని సమాధానమిచ్చాయి. వీటిని నిర్మించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొన్నాయి. చిన్నచిన్న అలలు, నీటి ఒత్తిడి వల్ల ఇంటి కోసం వేసే ప్లాట్‌ఫామ్‌ పైకి, కిందకు కదలడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాయి. టిటి కాకా సరస్సులోని తేలియాడే ఇళ్లను చూడటానికి వెళ్లిన పర్యాటకులు పలు ఆసక్తి విషయాలను వెల్లడించారు. ‘‘ఈ ఇళ్లు గాలులకు కొట్టుకుపోవా? అని బోటు డ్రైవర్‌ను అడిగాను. 

‘వీటికి పడవలు లాగానే లంగర్లు వేసుంటాయి. అందువల్ల పెనుగాలుల వల్ల కొట్టుకుపోయే అవకాశం తక్కువ. ఒకవేళ అలా వెళ్లిపోతే.. మేమే వాటిని వెతుక్కుంటూ వెళ్తాం’ అని అతను నవ్వుతూ జవాబిచ్చాడు’’ అని డారిస్‌ హోవర్డ్‌ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘ముంపు ముప్పు ఎదుర్కొంటున్న నగరాల్లో అన్ని వసతులతో ఈ తేలియాడే ఇళ్లను నిర్మించుకోవచ్చు. అన్ని నిర్మాణాలకు భిన్నంగా, మనసుకు ఆహ్లాదంగా ఉండే ఈ ఇళ్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో అన్ని దేశాల్లో తేలియాడే నగరాలు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. బలమైన స్టైరోఫోమ్, కాంక్రీట్, చెక్క ఉపయోగించి నీటిపై తేలియాడేలా బెడ్‌ తయారు చేసి.. దానిపైన నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపాయి. నీటి ఒత్తిడికి మునగకుండా.. తగిన బరువుతోనే నిర్మిస్తున్నామని వెల్లడించాయి.    

మరిన్ని వార్తలు