రీల్‌ కాదు రియల్‌ లైఫ్‌.. విధితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు.. వీడియో వైరల్‌

5 Sep, 2022 19:53 IST|Sakshi

మనిషి జీవితంలో కొన్ని ఘటనలు జీవించి ఉన్నంత కాలం గుర్తుండిపోతాయి. ప్రకృతి విపత్తు, మానవ తప్పిందం కారణంగానో జీవితంలో ఊహించిన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి ఘటనల వల్ల చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పటో వచ్చిన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. 

బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్‌ అనే వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్‌ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుడటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. 

అయితే, ఆరోజు అతడికి అదృష్టం కలిసివచ్చింది. పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్‌ సముద్రంపై తేలడం చూశాడు. దీంతో వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫీజర్‌ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది. అప్పటికైతే ఫ్రీజర్‌ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నా తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. ఇలా దాదాపు 11 రోజులపాటు ఫ్రీజర్‌లోనే తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. 

సరిగ్గా అదే సమయంలో అతడిలాగే సముద్రంలోకి బోటులో కొందరు వ్యక్తులు చేపల వేటకు వచ్చారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడుతున్న ఫ్రీజర్‌ను చూసి అటుగా బోటును అటుగా తిప్పారు. వారి ఊహించిన రీతిలో రోడ్రిగో కనిపించడంతో అతడిని తమ బోటులోకి ఎక్కించుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని సురినామ్‌ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో 11 రోజుల జీవితంలో విధితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. 

మరిన్ని వార్తలు