కోర్టు విచారణ.. జడ్జికే లైన్‌ వేసిన ముద్దాయి

8 Feb, 2021 16:16 IST|Sakshi

కోర్టు విచారణలో ముద్దాయి పిచ్చి వేషాలు

వాషింగ్టన్‌: కోర్టు విచారణ సమయంలో నిందితులు ఎంతో పద్దతిగా ప్రవర్తిస్తారు. పోలీసుల దగ్గర కాస్త అతి చేసినా చెల్లుతుంది కానీ.. కోర్టులో మాత్రం ఎలాంటి పిచ్చి వేశాలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పడం... మన వాదన వినిపించడం ఇదే జరిగేది. మన సినిమాల్లో కూడా న్యాయవాదులు, కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, సీన్లు ఉండవు. చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఇంతటి అత్యున్నత స్థానం ఉన్న కోర్టులో ఓ నిందితుడు పిచ్చి వేషాలు వేశాడు. ఏకంగా జడ్జికే లైన్‌ వేయడమేకాక.. పడిపోయాను అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. 

ఆ వివరాలు.. దక్షిణ ఫ్లోరిడా కోర్టులో తబితా బ్లాక్‌మోన్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రతివాది డెమెట్రిస్ లూయిస్ బ్రోవార్డ్‌ కౌంటీ జడ్జి తబితా బ్లాక్‌మోన్ ముందు వర్చువల్ విచారణలో హాజరయ్యాడు. కెమరా ముందుకు వచ్చాక లూయిస్‌.. జడ్జిని ఫ్లర్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘జడ్జి గారు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా.. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు పడిపోయాను’’ అంటూ జడ్జి తబితాను మోసే ప్రయత్నం చేశాడు. అతడి పొగడ్తలకు ఆమె నవ్వుకుని.. ‘‘థాంక్యూ.. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. పొగడ్తలు ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ కాదు’’ అని తెలిపారు.

ఇక లూయిస్‌పై నమోదయిన కేసు ఏంటంటే కొద్ది రోజుల క్రితం అతడు తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. డోర్‌ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని సదరు ఇంటి ఓనర్‌ డోర్‌బెల్‌ కెమెరా ద్వారా చూసి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ నేరానికి గాను కోర్టు లూయిస్‌కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. ఇక గతంలో మరణాయుధం కలిగి ఉన్నాడనే నేరం కింద లూయిస్‌ నాలుగేళ్లు జైల్లో గడిపి 2019లో బయటకు వచ్చాడు. 

చదవండి: ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?
               జడ్జీలూ సోషల్‌ మీడియా బాధితులే

మరిన్ని వార్తలు