సొమ్మొకరిది.. సోకొకరిది అంటే ఇదే!

29 Jul, 2020 17:12 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడం కోసం పలు దేశాలు భారీ ప్యాకేజీలను ప్రకటించాయి. దానిలో భాగంగా అమెరికాలో చిన్న కంపెనీలను కాపాడటం కోసం అక్కడి ప్రభుత్వం ‘పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్’ (పీపీపీ)‌ రుణాల పేరుతో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ ఇస్తోంది. 500 లేదా అంతకన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు అత్యవసర ఆర్థిక సాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్ అండ్‌ ఎకనామిక్ సెక్యూరిటీ (కేర్స్‌) చట్టం ప్రకారం ఈ పీపీపీ రుణాలు మంజూరు చేసింది. దానిలో భాగంగా ఫ్లోరిడాకు చెందిన డేవిడ్‌ టీ హైన్స్‌కు కూడా ప్రభుత్వం 4 మిలియన్‌ డాలర్ల కోవిడ్‌-19 ఫెడరల్‌ రుణం మంజూరు చేసింది. ఉద్యోగుల సంక్షేమం కోసం ఇచ్చిన ఈ డబ్బును డేవిడ్‌​ తన సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు. (అమెరికాలో ‘చైనా’ పార్శిళ్ల కలకలం!)

ఈ మొత్తంలో నుంచి సుమారు 3,18,000 డాలర్లు ఖర్చు చేసి ఏకంగా లంబోర్గిని కారు కొన్నాడు. మిగిలిన డబ్బుతో ఆభరణాలు కొనడమే కాక ఓ స్టార్‌ హోటల్‌లో లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తూ గడిపాడు. ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కావడంతో విచ్చలవిడిగా జల్సా చేస్తూ.. ఈ నెల ప్రారంభంలో ఓ యాక్సిడెంట్‌ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీయడంతో ఇతగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల కోసం ఇచ్చిన డబ్బును ఇలా సొంతానికి వాడుకోవడంతో డేవిడ్‌పై బ్యాంక్‌ మోసం, ఆర్థిక సంస్థకు తప్పుడు సమాచారం ఇవ్వడం, చట్టవిరుద్ధమైన ఆదాయంలో లావాదేవీలకు పాల్పడటం వంటి కేసులు నమోదు చేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు