Afghanistan Crisis: కాబూల్‌ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, కాల్పులు

17 Aug, 2021 03:22 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌లో పౌరుడిని హెచ్చరిస్తున్న అమెరికా సైనికుడు

అఫ్గాన్‌ను విడిచి వెళ్లిపోవడానికి జనం ఆరాటం

వేలాది మందితో కిక్కిరిసిపోతున్న కాబూల్‌ ఎయిర్‌పోర్టు

కాబూల్‌ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, కాల్పులు.. ఏడుగురి కన్నుమూత 

గాల్లో విమానం చక్రాలకు వేలాడుతూ పట్టుతప్పి ముగ్గురి మృతి

Chaotic Scenes At Kabul Airport అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. అఫ్గాన్‌లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది.
రన్‌వేపై విమానాల కోసం వేచిచూస్తున్న వందలాది మంది పౌరులు

దేశవిదేశీ పౌరులతో కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. ఎయిర్‌పోర్టుకు దారితీసే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. కాబూల్‌ నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రయాణికుల విమాన సేవలే కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జనం గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. విమానాల రాకకోసం వేలాది మంది పిల్లా పాపలతో కలిసి ఆకలి దప్పులు మరిచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏకంగా రన్‌వే పైకి చేరుకొని నిరీక్షిస్తున్నారు.

ఏదైనా విమానం రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. టేకాఫ్‌ అవుతున్న విమానాల వెంట ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆకాంక్షే అందరిలోనూ కనిపిస్తోంది. కొందరు విమానం రెక్కలపైకి ఎక్కి కూర్చుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇక్కడ నిలబడడానికి స్థలం లేదని వాపోయారు. పిల్లల ఏడుపులు, పెద్దల అరుపులు, యువకుల ఆగ్రహావేశాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

పది మంది మృతి


దేశం విడిచి వెళ్లడానికి కాబూల్‌ ఎయిర్‌పోర్టులో విమానం పైకి ఎక్కి కూర్చున్న జనం 

తాజాగా కాబూల్‌ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు. ఈ దృశ్యాలను టెహ్రాన్‌ టైమ్స్‌ పత్రిక ట్విట్టర్‌లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్‌నకు సిద్ధమవుతున్న అమెరికా జెట్‌ విమానంపైకి ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. విమానం కదులుతుండగా పెద్ద సంఖ్యలో జనం దాని వెనుక పరుగులు తీయడం వారి ఆత్రుతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతోపాటు కొందరు జారిపడ్డారని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.   అలాగే విమానాశ్రయంలో అమెరికా సైనికుల కాల్పుల్లో ఇద్దరు సాయుధులు చనిపోయారు.

బయటకు రావాలంటే భయం భయం

ప్రాణం కోసం పరుగులు 

అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకొనే క్రమంలో తాలిబన్లు కేవలం సైనికులు, పోలీసులతో తలపడ్డారు తప్ప సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినప్పటికీ జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. జైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయుధాగారాలను లూటీ చేశారు. కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. నిలాన్‌ అనే 27 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. తాను కాబూల్‌ వీధుల్లో 15 నిమిషాల పాటు ప్రయాణించానని, పురుషులు తప్ప మహిళలెవరూ కనిపించలేదని చెప్పారు. వంట సరుకులు తెచ్చుకోవడం లాంటి చిన్నచిన్న పనుల కోసం కూడా మహిళలు బయటకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. ‘ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. మా ఉద్యోగాలు ఉన్నాయో ఊడాయో తెలియదు. మా జీవితం ముగిసిపోయినట్లే, భవిష్యత్తు లేనట్లే అనిపిస్తోంది’ అని నిలాన్‌ వ్యాఖ్యానించారు.

మరో వేయి మంది అమెరికా సైనికులు  
అఫ్గానిస్తాన్‌ నుంచి వెనక్కి మళ్లుతున్న అమెరికా, దాని మిత్రదేశాల ఉద్యోగుల రక్షణ కోసం కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు రాబోయే 48 గంటల్లో  వేయి మంది సైనికులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ భద్రత కోసం ఇప్పటికే అమెరికా అక్కడ 5వేల మంది సైనికులను మోహరించింది.

ఎయిర్‌పోర్టు జోలికి రావొద్దు
అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికారులు ఖతార్‌ రాజధాని దోహాలో సీనియర్‌ తాలిబన్‌ నాయకులతో తాజాగా చర్చలు జరిపారు. కాబూల్‌ ఎయిర్‌పోర్టు నుంచి తమ ఉద్యోగులు, పౌరులను స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టు తమ నియంత్రణలోనే ఉంటుందని, దాని జోలికి రావొద్దని సూచించారు. దీనికి తాలిబన్లు అంగీకరించారని సమాచారం.

‘ఉగ్ర’నిలయంగా మారనివ్వద్దు: ఐరాస
తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌ ఉగ్ర మూకలకు నిలయంగా మారకుండా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వ్యవహరించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెరస్‌ సోమవారం పిలుపునిచ్చారు. అఫ్గాన్‌ ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలివేయకూడదని భద్రతా మండలికి  గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్‌ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేక అత్యవవసర సమావేశం భారత్‌ నేతృత్వంలో జరిగింది. అఫ్గాన్‌పై భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్‌కు ఇది కీలక కఠోర సమయమని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబన్లు యత్నించాలని ఈ సందర్భంగా అంటోనియో హితవు పలికారు. తక్షణమే ఈ ప్రాంతంలో హింసను నివారించాలని, మానవ హక్కుల పరిరక్షణ చేయాలని అన్ని పక్షాలను గుటెరస్‌ కోరారు.

మరిన్ని వార్తలు