5.5 మిలియన్‌ డాలర్ల మేర టోకరా.. అమెరికాలో అరెస్టు!

25 Jul, 2020 12:35 IST|Sakshi

వాషింగ్టన్‌: చిన్న తరహా కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనాలు అందిపుచ్చుకునేందుకు అడ్డదారి తొక్కిన ఓ సాంకేతిక నిపుణుడిని ​​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5.5 మిలియన్‌ డాలర్ల మేర టోకరా వేసేందుకు ప్రయత్నించిన అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వివరాలు.. ముకుంద్‌ మోహన్‌ అనే వ్యక్తి గతంలో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం బిల్డ్‌డైరెక్ట్‌.కామ్‌ టెక్నాలజీస్‌కు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న అతడికి రాబిన్‌హుడ్‌ అనే బ్రోకరేజ్‌ సంస్థ ఉంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి చిన్న తరహా సంస్థలను గట్టెక్కించేందుకు ట్రంప్‌ సర్కారు ప్రకటించిన ‘పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’ ప్రయోజనాలు పొందేందుకు ముకుంద్‌ పథకం రచించాడు. 

ఇందులో భాగంగా ఆరు షెల్‌ కంపెనీల పేరిట ఎనిమిది రకాల లోన్లకు దరఖాస్తు చేసుకున్నాడు. తన కంపెనీలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు గతేడాది దాదాపు 2.3 మిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేశానని పేర్కొన్నాడు. కాబట్టి ఈ ప్రోగ్రాంకు తనను అర్హుడిగా భావించి లోన్‌ మంజూరు చేయాల్సిందిగా కోరాడు. అయితే వాస్తవానికి ఈ ఏడాది మేలోనే ఒక కంపెనీ యాజమాన్య హక్కులు మోహన్‌కు సంక్రమించాయని, అందులో అసలు ఒక్క ఉద్యోగి కూడా లేదని తెలియడంతో సీటెల్‌లో అతడిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇక ఈ విషయంపై స్పందించేందుకు మోహన్‌, అతడి బృందం నిరాకరించిందని స్థానిక మీడియా పేర్కొంది.

మరిన్ని వార్తలు