లొంగిపోయిన జాకబ్‌ జుమా

9 Jul, 2021 06:42 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా తాజాగా అధికారుల ఎదుట లొంగిపోయారు. అరెస్టు చేయడానికి న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని నిమిషాల ముందు లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. ఆయన 2009 నుంచి 2019 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాకబ్‌ జుమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. విచారణ కమిషన్‌ ముందు హాజరు కావాలని దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశించగా, ఆయన అందుకు నిరాకరించారు.

దీంతో కోర్టు ధిక్కరణ కింద జుమాకు న్యాయమూర్తి 15 నెలల జైలు శిక్ష విధించారు. బుధవారం అర్ధరాత్రి లోగా లొంగిపోవాలని ఆదేశించారు. లేకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక జాకబ్‌ జుమా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసు అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని జుమా ఆరోపించారు. జుమాకు జైలు శిక్ష విధిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునుసవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అయితే, హైకోర్టులో జుమాకు ఉశపమనం దక్కే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు