ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయనక్కర్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు

3 Aug, 2022 09:16 IST|Sakshi

వాషింగ్టన్‌: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్‌ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం  రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు.

కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు.

9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు.
చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?

>
మరిన్ని వార్తలు