చైనా వైరస్‌: ట్రంప్‌పై దావా.. ఒక్కొక్కరి మీద 1 డాలర్‌

22 May, 2021 20:54 IST|Sakshi

కరోనాను చైనా వైరస్‌ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై దావా

ఫెడరల్‌ కోర్టులో ఫిర్యాదు చేసిన సీఏసీఆర్‌సీ

బీజింగ్‌: కోవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పుడు మాజీ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను చైనీస్‌ వైరస్‌ అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతి సారి కోవిడ్‌ విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ చైనా సంస్థ ట్రంప్‌పై పరువు నష్టం దావా వేసింది. ఆ వివరాలు.. కోవిడ్‌ను “చైనా వైరస్” గా పేర్కొన్నందుకు గాను చైనా-అమెరికన్ పౌర హక్కుల సంఘం (సీఏసీఆర్‌సీ), డొనాల్డ్ ట్రంప్‌పై దావా వేసినట్లు తెలిపింది. ఈ మేరకు సీఏసీఆర్‌సీ గురువారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో, ఈ బృందం ట్రంప్ వాడిన "చైనా వైరస్" అనే పదాన్ని "నిరాధారమైనది" గా పేర్కొంది.

ఫిర్యాదులో కమిటీ, కరోనా వైరస్ విషయంలో ట్రంప్ ప్రవర్తన “తీవ్రంగా, దారుణమైనదిగా” ఉందని ఆరోపించింది. అంతేకాక ట్రంప్ తన ప్రవర్తనతో చైనా అమెరికన్లకు "మానసిక క్షోభ" కలిగించారని దావాలో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా అమెరికా అంతటా ఆసియా మూలాలున్న వ్యక్తులపై దాడులు పెరిగాయి. వైరస్ పరంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడులకు పరోక్ష కారణమని చాలా మంది కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 17న, అట్లాంటాలో ఆసియా అమెరికన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన హింసాత్మక సంఘటనలో ఆసియా సంతతికి చెందిన ఆరుగురు మహిళలతో సహా ఎనిమిది మందిని ఉగ్రవాది కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం, ట్రంప్ తన “వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల” కోసం కరోనాను ‘‘చైనా వైరస్‌’’ అని “ఉద్దేశపూర్వకంగా” ఉపయోగించారని కమిటీ ఆరోపించింది. ట్రంప్‌ వ్యాఖ్యల వల్ల ఆసియా అమెరికన్ల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపింది. ఈ క్రమంలో సీఏసీఆర్‌సీ అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఆసియా అమెరికన్‌కు క్షమాపణగా  ట్రంప్‌ 1 డాలర్‌ చెల్లించాలని డిమాండ్‌ చేసింది. అంటే మొత్తంగా  22.9 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కోరింది. ఈ మొత్తంతో ఆసియా అమెరికన్‌ మూలాలు కలిగిన వారు అమెరికాకు చేసిన సహకారాన్ని ప్రదర్శించడానికి ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని కమిటీ తెలిపింది. 

ఈ దావాపై డోనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లెర్ ది హిల్‌తో మాట్లాడుతూ “ఇది పిచ్చి, మూర్ఖమైన దావా.. ఈ కేసు ఎప్పుడు న్యాయస్థానానికి చేరుకున్నా దాన్ని కొట్టేస్తారు’’ అని మిల్లెర్ తెలిపాడు. 

చదవండి: ట్రంప్‌ బుద్ద.. ఎంతైనా చైనోడి తెలివే వేరబ్బా!

మరిన్ని వార్తలు