ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...

2 Nov, 2020 11:18 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లో అంతరించిపోయిందనుకున్న ఒక సాలీడు జాతిని ఇటీవలే కనుగొన్నారు. యూకేలోని సర్రేలో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌కు చెందిన ఒక స్పైడర్‌ జౌత్సాహికుడు మైక్‌ వైట్‌ మిలిటరీ సైనిక శిభిరంలో దీనిని కనుగొన్నాడు. ఫాక్స్‌ స్పైడర్‌గా పిలిచే ఈ జాతి సాలీడులో బ్రిటన్‌లో చివరిసారిగా 1993లో కనిపించాయి. తరువాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. ఈ సాలీడు జాతి గురించి చెప్పాలంటే ఇవి చాలా వేగంగా, చురుకుగా ఉంటాయి.

ఊసరవెల్లిలాగా తమ పరిసరాలకు అనుగుణంగా రంగులను కూడా మార్చుకోగలవు. ఇది ఒక అరుదైన సాలీడు జాతి. ఇది బ్రిటన్‌లో కేవలం మూడు ప్రాంతాలలోనే కనిపిస్తుంది. దీనికి ఎనిమిది కనులు, స్పష్టమైన కంటిచూపు ఉంటుంది. ఇవి రాత్రి పూట ఆహారం కోసం వేట మొదలు పెడతాయి. రాళ్లను తవ్వి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఆహార సేకరణలో ఇవి నక్కలాగా ప్రవర్తిస్తాయి అందుకే వీటిని ఫాక్స్‌ స్పైడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ సాలీడు జాతి 27 ఏళ్ల క్రితం కనిపించి మళ్లీ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించకపోవడంతో అంతం అయిపోయిందని భావించినట్లు వైట్‌ తెలిపారు. ఇనాళ్లు మళ్లీ కనుగొనడం ఆనందంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు.   

చదవండి: ఇలాంటి స్పైడర్‌ ఎప్పుడైనా చూశారా..


 

>
మరిన్ని వార్తలు