ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌

30 Oct, 2020 04:48 IST|Sakshi
లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందు ఈఫిల్‌ టవర్‌ వద్ద సందర్శకులు

జర్మనీలో ఆంక్షలు కఠినతరం

యూరప్‌పై కరోనా పంజా

పది రోజుల్లోనే రోగుల సంఖ్య రెట్టింపు, కిటకిటలాడుతున్న ఆస్పత్రులు  

పారిస్‌/లండన్‌/బెర్లిన్‌: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ యూరప్‌ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫ్రాన్స్‌ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అన్నారు.

అందుకే లాక్‌డౌన్‌ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు. తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 1 వరకు కొనసాగుతుంది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు. క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ప్రకటించారు. గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్‌ తెలిపారు.  

మిగిలిన దేశాల్లో నిబంధనలు ఇలా..
యూరప్‌లో మిగిలిన దేశాలు కూడా పలు ఆంక్షల్ని విధిస్తున్నాయి. పోర్చుగల్‌ ప్రభుత్వం దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. వారం రోజుల పాటు ప్రయాణాలపై ఆంక్ష లు విధించింది. బెల్జియంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న దేశాల్లో బెల్జియం ముందుంది. చెక్‌ రిపబ్లిక్‌లో కర్ఫ్యూ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని తప్పనిసరి చేశారు. ఇక బ్రిటన్‌లో కూడా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని ఆరోగ్య నిపుణులు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కి సూచిస్తున్నారు. ప్రభుత్వ సలహా సంస్థ సేజ్‌ సెకండ్‌ వేవ్‌ యూరప్‌ని ఘోరంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యూరోపియన్‌ యూనియన్‌ కరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు