సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. మళ్లీ లాక్‌డౌన్‌

29 Oct, 2020 08:45 IST|Sakshi
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్(ఫైల్‌ ఫొటో)

ఫ్రాన్స్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

లాక్‌డౌన్‌ ప్రకటించిన ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌

సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు

జాగ్రత్త పడకపోతే 4 లక్షల అదనపు మరణాలు సంభవించే అవకాశం 

పారిస్‌: మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ బుధవారం ప్రకటించారు. దేశంలో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘యూరప్‌లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్‌లో కూడా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇప్పటికే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 3 వేల మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు.

నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్తపడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాజధాని నగరం పారిస్‌ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రెండువారాల క్రితమే కర్ప్యూ విధించినా కరోనా కేసుల(సెకండ్‌వేవ్‌)ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. (చదవండి: కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!)

ఎకానమీకి నష్టం కలగకుండా చర్యలు
ఇక లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మాక్రాన్‌ స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఆర్థిక కార్యకాలపాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఒకవేళ లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని, క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకొనే పరిస్థితులు రావాలని మాక్రాన్‌ ఆకాంక్షించారు. ఇక వర్క్‌ఫ్రం హోంకు అనుమతించిన సంస్థలు వాటిని పొడిగిస్తే బాగుంటుందన్నారు. అదే విధంగా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ది సాంటే పబ్లిక్‌ ఫ్రాన్స్‌ హెల్త్‌ ఏజెన్సీ వివరాల ప్రకారం, బుధవారం ఒక్కరోజే ఈ యూరప్‌ దేశంలో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36,000 వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు