ఈగను చంపబోయి.. ఇంటిని తగలబెట్టాడు

8 Sep, 2020 16:24 IST|Sakshi

పారిస్‌: ఈగ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ పగబడితే ఎలా ఉంటుందో.. ఎంత విధ్వంసం చేస్తుందో దర్శక ధీరుడు జక్కన్న తన ఈగ చిత్రంలో బ్రహ్మండంగా చూపించాడు. ఈ సినిమాలో విలన్‌ ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు‌. అయితే ఇదంతా రీల్‌లో. కానీ రియల్‌గా కూడా ఇదే సన్నివేశం రిపీట్‌ అయ్యింది. అయితే అది మన దగ్గర కాదు.. ఫ్రాన్స్‌లో. ఈగను చంపడానికి ప్రయత్నించి ఇంటినే తగలబెట్టుకున్నాడు ఓ వృద్ధుడు. ఈ సంఘటన గత శుక్రవారం పార్కుల్-చెనాడ్ అనే గ్రామంలో జరగింది. స్థానిక పత్రిక కథనం ప్రకారం.. 80 ఏళ్ల వృద్ధుడు రాత్రి భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఇంతలో ఓ ఈగ గుయ్‌మని ఆయనని విసిగించడం ప్రారంభించింది. ఆగ్రహం పట్టలేక ఈగని చంపడం కోసం ఎలక్ట్రిక్‌ రాకెట్‌ను ఉపయోగించాడు.

అయితే అప్పటికి అతని ఇంట్లో గ్యాస్‌ లీకవ్వడం ప్రారంభమయ్యింది. అది గమనించని వృద్ధుడు ఈగని చంపడం కోసం ఎలక్ట్రిక్‌ రాకెట్‌ని ఉపయోగించడం.. ఈగ తప్పించుకోవడం.. వంట గదిలో పేలుడు సంభవించడం అన్ని ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో అతడి ఇంటి పై కప్పు పాక్షికంగా దెబ్బతిన్నది. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018 లో, కాలిఫోర్నియాలోని ఒక వ్యక్తి కొన్ని సాలెపురుగులను కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఇంటికి నిప్పంటించాడు. అదే సంవత్సరంలో, బొద్దింకలను కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ తన ఇంటిని పేల్చేశాడు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు