Covid Live Updates: ‘రేపట్నుంచి 6 - 11 ఏళ్ల పిల్లలకు మాస్కులు తప్పనిసరి!’

2 Jan, 2022 16:25 IST|Sakshi

ప్యారిస్‌: మహమ్మారి వ్యాప్తి చెందినప్పట్నుంచి శనివారం నాటికి కోటికి పైగా కరోనా ఇన్ఫెక్షన్లు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్ 6వ దేశంగా అవతరించినట్లు అధికారిక సమాచారం. గడచిన 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 2,19,126 కోవిడ్‌ కొత్త కేసులు నమోదయ్యినట్లు ఫ్రాన్స్‌ హెల్త్‌ అధారిటీస్‌ నివేదిక విడుదల చేశాయి. వరుసగా నాలుగో రోజు కూడా రెండు లక్షలకు పైగా కోవిడ్‌ ఇన్ఫెక్షన్లు నమోదయ్యినట్లు ఈ నివేదిక తెల్పుతోంది. 10 మిలియన్లకుపైగా కరోనా కేసులు నమోదైన అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, బ్రిటన్‌, రష్యా దేశాల సరసన తాజాగా ఫ్రాన్స్‌ చేరింది. దీంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాబోయే కొన్ని వారాలు కష్టతరంగా మరొచ్చని హెచ్చరికలు జారీ చేశాడు. 

ఐతే పెరుగుతున్న పాజిటివిటీ కేసుల దృష్ట్యా దేశంలో మరిన్ని ఆంక్షల విధింపుకు బదులు ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచనలివ్వడం గమనార్హం. సోమవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో 6-11 సంవత్సరాల పిల్లలతో సహా, ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ముందే హెచ్చరించింది. కాగా గడచిన 7 రోజుల వ్యవధిలో ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయిలో కేసులు పుట్టుకొచ్చాయి. కేవలం ఒక్క నెలలో ఐదు రెట్లు పెరిగాయి. 24 గంటల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 96కు పెరిగింది. అలాగే కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 24 గంటల్లో 110 పెరగగా, ఆ సంఖ్య 123,851కి చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌ మరణాల్లో 12వ స్థానంలో ఫ్రాన్స్‌ ఉంది. ఆ దేశంలో మే 14 నుండి అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

చదవండి: ‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే..

>
మరిన్ని వార్తలు