కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్‌

22 Jun, 2022 05:32 IST|Sakshi

మొదటిసారిగా నల్లజాతీయురాలికి అవకాశం

బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్‌ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్‌ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్‌ 7న బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆఫ్రో–కొలంబియన్‌ అయిన ఫ్రాన్సియా మార్కెజ్‌(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా   సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్‌ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్‌ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు

. తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్‌లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్‌ పోల్‌ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు.

కానీ, పార్టీలోని మిగతా సీనియర్‌ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్‌ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్‌ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు