స్వేచ్ఛా వాణిజ్యానికి చెల్లుచీటీ.. సంపన్న దేశాల నయా పోకడ

15 Sep, 2022 02:43 IST|Sakshi

సంపన్న దేశాల నయా పోకడ

ఇకపై మిత్ర దేశాలతోనే వ్యాపారం 

విపరిణామమేనంటున్న నిపుణులు

ఇంతకాలం స్వేచ్ఛా వాణిజ్యం, గ్లోబలైజేషన్‌ అంటూ ఊదరగొట్టడమే గాక ప్రపంచ దేశాలన్నింటినీ అందుకు నయానో భయానో ఒప్పించిన సంపన్న పారిశ్రామిక దేశాలు ఇప్పుడు రూటు మారుస్తున్నాయి. ‘మిత్ర’ దేశాలతో మాత్రమే వ్యాపార బంధాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందుంది. దీన్ని ఫ్రెండ్‌ షోరింగ్, రీ షోరింగ్‌ (వ్యాపారాల తరలింపు), నియర్‌ షోరింగ్‌ (పొరుగు దేశాల్లోనే పరిశ్రమలు నెలకొల్పడం) వంటి పేర్లతో పిలుస్తున్నారు. ‘‘అన్ని వస్తువులనూ అమెరికానే తయారు చేయడం అసాధ్యం గనుక కాబట్టి నిరంతర సరఫరా కోసం నమ్మకమైన మిత్రదేశాలతో కలిసి అడుగులు వేయాల్సిన టైమొచ్చింది’’ అని అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల స్పష్టం చేశారు. అంతర్జాతీయ విపణిలో ఈ సరికొత్త మార్పు విపరిణామాలకే దారి తీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రంప్‌ హయాంలో అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇరు దేశాలూ పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ వచ్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలన్నింటికీ వస్తూత్పత్తి కేంద్రమైన చైనాతో విభేదాలతో అమెరికా, మిత్ర దేశాలకు సరుకుల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్నుంచి కోలుకోకముందే వచ్చి పడ్డ కరోనా అంతర్జాతీయ వాణిజ్యాన్ని రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ వెంటనే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది.

..అలా మొదలైంది 
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాలపై ఇక ఏ విషయానికీ ఆధార పడకూడదని అమెరికా, మిత్ర దేశాలు నిశ్చయానికి వచ్చాయి. దాంతో వాటిమధ్య ఫ్రెండ్‌ షోరింగ్‌ విస్తరిస్తూ వస్తోంది. నిర్నిరోధంగా సరుకుల ఉత్పత్తి, సరఫరా కోసం కలిసి పని చేయాలని అమెరికా, జపాన్, భారత్, యూరప్‌తో కలిసి 17 దేశాలు నిశ్చయించుకున్నాయి. పారదర్శకత, వైవిధ్యం, భద్రత, స్థిరత్వం అన్న నాలుగు సూత్రాల ఆధారంగా పని చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. చైనాను దూరం పెట్టేందుకు ఇండో పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ పేరిట మిత్ర దేశాలతోకలిసి అమెరికా మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. సెమీ కండక్టర్ల తయారీకి ఐరోపాలో ఏకంగా 4,300 కోట్ల పౌండ్ల పెట్టుబడులకూ సిద్ధపడింది. జీ7 దేశాలు కూడా వ్యూహాత్మక, అత్యవసర పరిశ్రమల తరలింపు కోసం ఏకంగా 60 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఇవన్నీ 150 దేశాల్లో పట్టు సాధించే లక్ష్యంతో చైనా తెర తీసిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ విధానానికి విరుగుడు యత్నాలే. 
- దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి

అభివృద్ధికి విఘాతమే: రాజన్‌ 
ధనిక దేశాల ఫ్రెండ్లీ షోరింగ్‌ ధోరణి పేద, వర్ధమాన దేశాలకు గొడ్డలిపెట్టుగా మారగలదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ హెచ్చరిస్తున్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్యం వల్ల భారీగా వచ్చిపడ్డ పెట్టుబడులతో ఈ దేశాలు బాగా లాభపడ్డాయి. సంపన్న దేశాల తిరోగమన విధానంతో ఇది తలకిందులవుతుంది’’ అన్నది ఆయన అభిప్రాయం. 

మనకు లాభమే! 
ఫ్రెండ్లీ షోరింగ్‌ విధానంతో ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, భారత్, బల్గేరియా, రొమేనియా వంటి దేశాలు లాభపడతాయని అంచనా. భారత్‌లో 300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్‌ మైక్రో చిప్‌ ప్లాంట్‌ పెట్టనుంది. ఆస్ట్రేలియా కూడా ఖనిజాల సరఫరా ఒప్పందం చేసుకుంది. విధానాలను మరింత సరళతరం చేస్తే ఇలాంటి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయన్నది ఆర్థికవేత్తల అంచనా.

75 ఏళ్ల గ్లోబలైజేషన్‌ 
రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛా వాణిజ్యానికి పునాదులు వేస్తూ భారత్‌ సహా 23 దేశాలు 1947 అక్టోబర్లో గాట్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1995 నాటికి 125 దేశాలు ఇందులో చేరాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు ద్వారా దీనికి సంస్థాగత రూపం ఏర్పడింది. చౌకగా శ్రమ శక్తి, ముడి సరుకులు లభించే ప్రాంతాలు, వస్తూత్పత్తి సామర్థ్యమున్న దేశాలకు బడా పరిశ్రమలు తరలి వెళ్లేందుకు ఇది ఉపయోగపడింది.

ఇదీ చదవండి: క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్‌ చేంజర్‌

మరిన్ని వార్తలు