కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్‌

24 Aug, 2020 16:41 IST|Sakshi

పారిస్‌ : ఫ్రాన్స్‌, మోంటాపెల్లియర్‌లోని ప్రఖ్యాత నేచురిస్ట్‌ రిసార్ట్‌ ‘కాప్‌ డిఎగ్డే’ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ సేదతీరుతున్న న్యూడిస్టుల నిర్లక్ష్యం కారణంగా రిసార్టులో ఇప్పటి వరకు 95 మందికి వైరస్‌ సోకింది. హాలిడేను ముగించుకుని ఇంటికి వెళ్లిన దాదాపు 55 మంది అనారోగ్యం పాలయ్యారు. రిసార్టులో పర్యటిస్తున్న న్యూడిస్టులు భౌతిక దూరాన్ని పాటించకపోవటం, మాస్కులు ధరించకపోవటమే ఇందుకు కారణమని ఫ్రెంచ్‌ వైద్యాధికారులు చెబుతున్నారు. ( 94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’)

గత సోమవారం 194 మందికి పరీక్షలు నిర్వహించగా 38 మందికి, బుధవారం నాడు 244 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. బయటి గ్రామాల కంటే రిసార్టులో వైరస్‌ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందని ఆరోగ్య శాఖ చెబుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు ఉన్న వారిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించింది. కాగా, ఫ్రాన్స్‌లో గడిచిన 24 గంటల్లో 4,900 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,42,899కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి 30 వేల మంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు