సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ విడుదలకు ఆదేశాలు

21 Dec, 2022 19:40 IST|Sakshi

ఖాట్మాండు: ఫ్రెంచ్‌ సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌కు.. 19 ఏళ్ల  జైలు శిక్ష తర్వాత ఊరట లభించింది. వయసు రీత్యా అతన్ని విడుదల చేయాలని నేపాల్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్‌ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్‌ శోభరాజ్‌ 2003 నుంచి నేపాల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 78 ఏళ్లు.

1975లో శోభరాజ్‌ నేపాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌తో ప్రవేశించడం.. అమెరికా పౌరుడు 29 ఏళ్ల కొన్నీ జో బోరోన్‌జిచ్‌, అతని స్నేహితురాలు 26 ఏళ్ల కెనడియన్‌ లారెంట్‌ క్యారియర్‌ ఇద్దర్నీ హత్య చేసిన నేరంపై నేపాల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభరాజ్‌ తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం వాసి. శోభరాజ్‌కు ఫ్రెంచ్‌ పౌరసత్వం ఉంది. పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్‌చంద్ భవనాని. అతని ఫోటో నేపాల్‌లోని ఒక వార్త పత్రికలో ప్రచురితమవ్వడంతో ఆచూకీ ప్రపంచానికి తెలిసింది.

జంట హత్యలు చేసినందుకుగానూ ఖాట్మండులోని సెంట్రల్‌ జైలులో 20 ఏళ్లు శిక్ష, నకిలీ పాస్‌పోర్ట్‌ ఉపయోగించినందుకు గానూ ఒక ఏడాది జైలు శిక్ష కలిపి మొత్తం 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాదు రూ. 2 వేలు జరిమానా కూడా చెల్లించాడు. ఈ కరడుగట్టిన నేరస్తుడి గురించి సినిమాల్లో రిఫరెన్సులు ఉండడం, అతనిపై పలు సినిమాలు కూడా రావడం తెలిసిందే. 

(చదవండి: రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..)

మరిన్ని వార్తలు