Mehul Choksi: అదృశ్యం.. రంగంలోకి దిగిన సీబీఐ

25 May, 2021 19:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ అదృశ్యమయిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ ఆదృశ్యమైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. దాంతో ఆందోళ‌న‌కు గురైన వారి కుటుంబ స‌భ్యులు త‌న‌ను పిలిచి మాట్లాడార‌ని చోక్సీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విష‌య‌మై ఆంటిగ్వా పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించార‌ని వెల్ల‌డించారు. అత‌ని భద్ర‌త గురించి కుటుంబ స‌భ్యులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు.

అక్కడి ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఆయన క్యూబాకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. 2017లో మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయిన సంగతి తెలిసిందే.

చదవండి: పీఎన్‌బీ స్కాం: చోక్సీకి భారీ షాక్‌

మరిన్ని వార్తలు