వ్యాక్సినేషన్‌ పూర్తయితే మాస్కు అక్కర్లేదు

15 May, 2021 05:04 IST|Sakshi
మీడియాతో సమావేశం అనంతరం మాస్క్‌ లేకుండా వెళ్తున్న బైడెన్, కమలా హ్యారిస్‌

ప్రకటించిన అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ

టీకాతో కోవిడ్‌ సోకే అవకాశం తక్కువ: బైడెన్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ ప్రకటించింది. వారు ఇకపై భౌతిక దూరం వంటి చర్యలను కూడా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంట్లో ఉన్నప్పటికీ, బయటకు వెళ్లినప్పటికీ మాస్కును వాడాల్సిన పని లేదని తేల్చి చెప్పింది.

ఇదో గొప్ప మైలురాయి: బైడెన్‌
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా కలసి గురువారం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిరువురూ మాస్కులు లేకుండానే కనిపించారు. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్‌ చాలా వేగంగా చేశామని, అది గొప్ప మైలు రాయి అని బైడెన్‌అన్నారు. పూర్తి వ్యాక్సినేషన్‌ను పొందిన వారికి వైరస్‌ సోకే అవకాశం చాలా తక్కువని అన్నారు. అయితే వ్యాక్సినేషన్‌ చేసుకోని వారు, ఒక డోసు వ్యాక్సిన్‌ మాత్రమే తీసుకున్నవారు మాత్రం అది పూర్తయ్యే వరకు మాస్కు ధరించాలని అన్నారు.

కేవలం 114 రోజుల్లోనే 25 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశామని బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికాలో రాష్ట్రాంతర ప్రయాణాలు చేసేవారికి ఇకపై నియమాలు ఉండబోవన్నారు. మొత్తం 50 రాష్ట్రాలకుగానూ 49 రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇప్పుడు అత్యంత తక్కువ మంది మాత్రమే ఆస్పత్రిపాలవుతున్నారని అన్నారు. మరణాల రేటు 80శాతం పడిపోయిందన్నారు. యువతకు కేవలం 4 నెలల్లో 5.5 శాతం నుంచి 60 శాతం మందికి కనీసం ఒక్క వ్యాక్సిన్‌ డోసు అయినా ఇచ్చామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు