రష్యా రాక్షసకాండను సహించబోం.. శిక్ష తప్పదు.. జీ7 దేశాల హెచ్చరిక

19 Apr, 2023 05:34 IST|Sakshi

టోక్యో:  తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘తీరు మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’’అని ఆ దేశాలను హెచ్చరించాయి. జీ7 దేశాలైన జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ విదేశాంగ మంత్రులు, అత్యున్నత ప్రతినిధుల మూడు రోజుల సదస్సు జపాన్‌లోని కరూయిజవాలో మంగళవారం ముగిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రులు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు.

రష్యాను దారికి తీసుకురావడమే లక్ష్యంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాకు శిక్ష తప్పదన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను సహించబోమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్నారు. చైనా, తైవాన్‌ మధ్య శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పారు. జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మే లో జపాన్‌లోని హిరోషిమాలో జరగనుంది. చైనాపై జీ7 కూటమి కుట్రలు పన్నుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ వెన్‌బిన్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు