100 కోట్ల టీకా డోసులిద్దాం

12 Jun, 2021 04:43 IST|Sakshi
శుక్రవారం కార్బిస్‌బే హోటల్‌ వద్ద బీచ్‌లో ఫొటోలకు పోజిచ్చిన జి–7, ఈయూ నేతలు

కరోనా నుంచి ప్రపంచ దేశాలను ఆదుకుందాం

జీ7 శిఖరాగ్ర భేటీలో సభ్య దేశాల నిర్ణయం

యూకేలోని కార్బిస్‌బే రిసార్టులో ప్రారంభమైన సదస్సు 

తొలిరోజు కరోనాపై పోరాటం, వ్యాక్సినేషన్‌పై చర్చ

కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రపంచదేశాల అధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంపై కోవిడ్‌–19 వైరస్‌ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ పాల్గొంటున్నాయి.

మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్‌ బ్యాక్‌ బెట్టర్‌ ఫ్రమ్‌ కోవిడ్‌–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. జీ7 సదస్సులో మొదటిరోజు దేశాల అధినేతలు ఉల్లాసంగా కనిపించారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని ఈ సంపన్న దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు.

10 కోట్ల డోసులిస్తాం: బోరిస్‌ జాన్సన్‌
తమ వద్ద అవసరానికి మించి ఉన్న 10 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఏడాదిలోగా ప్రపంచ దేశాలకు ఉదారంగా అందజేస్తామని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. జీ7 సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన.. కరోనా మహమ్మారిని అంతం చేసే యజ్ఞంలో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 10 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు ఇస్తామన్నారు.  కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ–ఆస్ట్రాజెనెకాకు నిధులు సమకూర్చామని గుర్తుచేశారు. లాభార్జనను పక్కనపెట్టామని, తమ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు ఇప్పటిదాకా 50 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందాయని వెల్లడించారు.  జీ7 సదస్సులో   పాల్గొంటున్న దేశాల అధినేతలు సైతం ఇలాంటి దాతృత్వాన్నే ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.  

50 కోట్ల టీకా డోసులు అందజేస్తాం
సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌        మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 50 కోట్ల కోవిడ్‌ టీకా డోసులు అందజేస్తామని ప్రకటించారు. బహుళ జాతి కార్పొరేట్‌ సంస్థలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదన జీ7 సదస్సులో చర్చకు వచ్చింది. ఈ మేరకు దీనిపై ఆయా దేశాల ఆర్థిక మంత్రుల మధ్య వారం క్రితం ఒక ఒప్పందం కుదిరింది.  కాలుష్యం, వాతావరణ మార్పుల అంశం కూడా జీ7 సదస్సు అజెండాలో ఉంది. కాగా, సదస్సు జరుగుతున్న కార్బిస్‌బే రిసార్టు ఎదుట వందలాది మంది వాతావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు గుమికూడారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.సెయింట్‌ ఇవీస్‌లో జరిగిన ర్యాలీలో 500 మంది పాల్గొన్నారు. నిరసనకారులు ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరించారు. హామీలతో తుంగలో తొక్కుతున్న జీ7, మాటలే తప్ప చేతల్లేవ్‌ అని రాసి ఉన్న జెండాలను ప్రదర్శించారు.

>
మరిన్ని వార్తలు