Gay Couple: పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?

7 Jan, 2023 20:05 IST|Sakshi

న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు.

మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు.
ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది.  

అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్..

మరిన్ని వార్తలు