Gaza: హృదయవిదారకం.. నువ్వొక్కడివే మిగిలావు నాన్నా!

19 May, 2021 14:05 IST|Sakshi

గాజా సిటీ: అమ్మ ఒడిలో ఉండాల్సిన ఐదు నెలల చిన్నారి ఒమర్‌ ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్నాడు. మంచం అంచునే కూర్చున్న అతడి తండ్రి మహ్మద్‌ అల్‌- హదీద్‌ చెమర్చిన కళ్లతో పదే పదే కొడుకును చూసుకుంటూ ఉన్నాడు. బోసి నవ్వులతో వెలగాల్సిన ఆ పసివాడి ముఖం కుట్లతో నిండి ఉండటం, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కాలికి కట్లు కట్టి ఉండటం చూస్తుంటే ఆ తండ్రి మనస్సు తరుక్కుపోతోంది. ‘‘కనీసం నువ్వైనా మిగిలావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న తోడు నువ్వొక్కడివే నాన్నా’’ అంటూ మౌనంగానే రోదిస్తున్నాడు మహ్మద్‌. కొడుకు ఎక్కడ ఉలిక్కిపడి నిద్రలేస్తాడోనన్న భయంతో.

బాంబు దాడులకు బలైపోయి.. నిర్జీవంగా పడి ఉన్న భార్య చేతుల్లో నుంచి రక్షణ బృందాలు బిడ్డను వేరు చేసి.. ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాను కూడా చనిపోతే బాగుండు అనే ఆలోచన వస్తోంది మహ్మద్‌కు. కానీ నలుగురు కొడుకుల్లో చిన్నవాడు, పసివాడు అయిన ఒమర్‌ కోసమైనా బతకాల్సిన పరిస్థితి. ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్న పరస్పర క్షిపణి దాడుల కారణంగా అల్లకల్లోలమవుతున్న గాజాలోని అనేకానేక బాధిత కుటుంబాల్లో మహ్మద్‌ ఫ్యామిలీ ఒకటి. 

నలుగురు పిల్లలు.. ముచ్చటైన సంసారం
మహ్మద్‌ అల్‌- హదీది(37)- మహా అబు హతాబ్‌(36) దంపతులు. వీరికి సుహబ్‌(13), అబర్‌రహమాన్‌(8), ఒసామా(6), ఒమర్‌(5 నెలలు) సంతానం. రంజాన్‌ పండుగ సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు వేయించి, వారిని తీసుకుని బంధువుల ఇంటికి బయల్దేరింది మహా. గాజా సిటీకి కాస్త దూరంలో ఉన్న షతీ శరణార్థి శిబిరంలో తన వాళ్లను కలుసుకుని సంతోషించింది. చాలా కాలం తర్వాత వచ్చాను కదా.. ఈరోజు ఇక్కడే ఉంటాం అని భర్తను ఒప్పించింది. అందుకు సరేనన్నాడు మహ్మద్‌. భార్యాపిల్లలు ఇక్కడ.. అతడొక్కడే అక్కడ తమ ఇంట్లో. 

ఎందుకో మహ్మద్‌కు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. తెల్లవారుజామునే బాంబుల మోతతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. మరో ఆలోచన లేకుండా బయటకు పరుగులు తీశాడు. భార్యా, పిల్లలు ఉన్న చోటుకు వెళ్లి చూడగా.. అంతా శిథిలమై ఉంది. నిశ్చేష్టుడైపోయాడు మహ్మద్‌. భవన శిథిలాల కింద నుంచి ఒక్కొక్క శవాన్ని బయటకు తీస్తున్నాయి రక్షణ బృందాలు. తొలుత భార్య మహా, ఆ తర్వాత ముగ్గురు కొడుకుల మృతదేహాలు. ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది అతడికి. అంతలోనే ఒమర్‌ ఏడుపు సన్నగా వినబడింది. 

అతడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. సహాయక బృందాల చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని ఒక్కసారిగా గుండెకు హత్తుకున్నాడు మహ్మద్‌. మృదువుగా కొడుకు తలనిమిరి మరింత దగ్గరికి చేర్చుకున్నాడు. వెంటనే తనని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కనీసం తనకంటూ ఈ ప్రపంచంలో ఒక్కడైనా సజీవంగా మిగిలి ఉన్నాడన్న ఆశతో. ఇలాంటి మహ్మద్‌లు ఎందరెందరో గాజాలో. కానీ హమాస్‌ దాడులు, అందుకు ప్రతిగా అన్నట్లు ఇజ్రాయెల్‌ వేసే బాంబుల మోత అక్కడ నిత్యకృత్యమే. ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరపడుతుందో ఊహించడం కష్టం.

హమాస్‌ మిలటరీనే టార్గెట్‌ చేశామని ఇజ్రాయెల్‌ చెబుతున్నా.. ఆ దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ విషయం గురించి మానవ హక్కుల సంఘాలు ఎంతగా మొత్తుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏదేమైనా.. ఓవైపు వ్యవసాయం, మరోవైపు చేపల వేటపై ఆంక్షలు విధించడం సహా బాంబు దాడుల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోలేక గాజా ప్రజలు ఆకలికి అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. 

ఆ దేవుడికి ముందే తెలుసునేమో..
‘‘ఆరోజు నా పిల్లలు ఈద్‌ సంబరంలో కొత్త బట్టలు వేసుకున్నారు. బొమ్మలు తీసుకుని వాళ్ల అంకుల్‌ వాళ్లింటికి బయల్దేరారు. నా భార్య ఆరోజు అక్కడే ఉంటామని పట్టుబట్టింది. అందుకు నేను అనుమతించకపోయి ఉండే బాగుండేది. ఆరోజు నా జీవితంలో ఇంతటి విషాదాన్ని నింపుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఒమర్‌ ఒక్కడే ఇప్పుడు నాకంటూ ఉన్న తోడు. మీకు తెలుసా.. నా ముగ్గురు కొడుకులు తల్లిపాలు తాగి పెరిగారు. కానీ చిన్నవాడికి మొదటి నుంచీ ఆ అలవాటు లేదు. 

పుట్టిన నాటి నుంచే వాడు అమ్మ దగ్గర పాలు తాగలేదు. బహుశా.. ఆ దేవుడికి ముందే తెలుసునేమో. తల్లి వాడికి శాశ్వతంగా దూరమవుతుందని. అందుకే మమ్మల్ని ఇలా సన్నద్ధం చేశాడేమో. నేను వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అయినా మేం కూడా తొందర్లోనే మా వాళ్లను కలుస్తామేమో. ఇక్కడ ఎక్కువ రోజులు బతుకుతామనే నమ్మకం నాకు లేదు’’ అంటూ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 

మేమేం పాపం చేశాం
ఇజ్రాయెల్‌ దాడుల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లు కావాలనే చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని అనిపిస్తోంది. ఒక్కసారి హెచ్చరిక జారీ చేయకుండా.. ఇంటిని ఖాళీ చేయమని చెప్పకుండా ఇలా బాంబులు కురిపించడం న్యాయమా. మేమేం పాపం చేశాం.  నా బిడ్డ తల్లిలేని వాడయ్యాడు. నేను నా కుటుంబాన్నే కోల్పోయాను’’ అంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. కాగా గత సోమవారం నుంచి జరుగుతున్న పరస్పర దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని 200 మంది చనిపోగా, అందులో 59 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక పాలస్తీనియన్‌ వైపు నుంచి కురుస్తున్న బాంబు ధాటికి ఇజ్రాయెల్‌లో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. 

చదవండి: ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!

మరిన్ని వార్తలు