వీడియో: పార్లమెంట్‌లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకి చేదు అనుభవం!

26 Dec, 2023 13:50 IST|Sakshi

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమన్‌ నెతన్యాహూకి పార్లమెంట్‌ సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహూ ప్రసంగిస్తున్న వేళ.. గాజాలో హమాస్‌ బందీలుగా ఉన్న వాళ్ల కుటుంబీకులు తమ నిరసన గళాలతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు వాళ్లు.

సోమవారం ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని నెతన్యాహు ప్రసంగం జరుగుతున్న టైంలో.. కుటుంబ సభ్యులు ఫ్లకార్డులపై బందీల ఫొటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహూ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. 

నెతన్యాహు ప్రసంగిస్తూ సమయంలో నెస్సెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేని నిలబడ్డారు .. ‘‘ సమయం లేదు..  ఇప్పుడే, ఇప్పుడే.. అంటూ గట్టిగా గట్టిగా నినాదాలు చేశారు. అయితే నెతన్యాహూ వాళ్లకు సున్నితంగా సర్దిచెప్పే యత్నం చేశారు. మన బిడ్డలు ఊరికనే చనిపోవడం లేదు. మన దేశ నాశనం కోరుకుంటున్న శత్రువులపై విజయం సాధించేంతవరకు ఈ ప్రయత్నం ఆపకూడదంటూ వ్యాఖ్యానించారు. 

అయితే అప్పటికీ బందీల కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. మా వాళ్లను సురక్షితంగా వెనక్కి మీరు తీసుకొస్తారని నమ్మాం. 80 రోజులు.. ప్రతీ క్షణం నరకంగా గడిపాం. ఇదే మీ కూతురో, కొడుకుకో అయి ఉంటే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్నించారు. 

దానికి ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ.. బందీల విడుదల కోసమంటూ చేయని ప్రయత్నమేదీ లేదని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడనంటూ గుర్తు చేశారాయన. అందరినీ సురక్షితంగా విడిపించేంతవరకు సంయమనం పాటించాలని కోరారాయన. 

ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాజాలో హమాస్‌ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇందులో 22 మంది మరణించగా.. వాళ్ల మృతదేహాలు కూడా  బంధువుల్ని చేరలేదు. అక్టోబర్‌ 7వ తేదీన ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. వేల మందిని బలి తీసుకుంది. ఇజ్రాయెల్‌ తరఫున 1,200 మంది మరణించగా, హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజాలో 20 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు